మాస్కో: రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ వాట్సప్, టెలిగ్రామ్‌పై నిషేధం విధించింది. చట్టపరమైన ఉల్లంఘనల ఆరోపణలతో పాటు స్వదేశీ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రష్యా ప్రభుత్వం స్పష్టం చేసింది. రష్యన్ చట్టాలను పాటించకపోతే దేశంలో కార్యకలాపాలు నిలిపివేస్తామని ఇటీవల పలు ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌లకు రష్యా ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
రష్యన్ పౌరుల డేటాను దేశంలోనే నిల్వ చేయాలని ఆయా ప్లాట్‌ఫామ్‌లకు ప్రభుత్వం సూచించింది. అలాగే, సోషల్ మీడియాలో రష్యా వ్యతిరేక కంటెంట్‌ను వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రష్యన్ చట్టాలను పాటించకపోతే నిర్మోహమాటంగా ఆయా ప్లాట్ ఫామ్‌ల సేవలను రష్యాలో బ్యాన్ చేస్తామని హెచ్చరించింది. ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ తీర్చు మార్చుకోలేదంటూ టెలిగ్రామ్, వాట్సప్ వంటి ఆన్ లైన్ ప్లాట్‌ఫామ్‌లపై తాజాగా నిషేధం విధించింది.
రష్యా బ్యాన్ నిర్ణయాన్ని వాట్సప్ తీవ్రంగా ఖండించింది. ఈ చర్య 100 మిలియన్లకు పైగా వినియోగదారులను ప్రభుత్వ నిఘా యాప్ మాక్స్ వైపు మళ్లించే కుట్ర అని ఆరోపించింది. ఈ యాప్ వాడకం రష్యా పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతోందని పేర్కొంది. వినియోగదారులను తిరిగి కనెక్ట్ చేయడానికి మేము చేయగలిగినదంతా చేస్తున్నామని తెలిపింది.
మెటా నేతృత్వంలోని వాట్సప్ రష్యాలో తమ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి రష్యన్ చట్టాలను తప్పక పాటించాల్సిందేనని మాస్కో తేల్చి చెప్పింది. ఆన్‌లైన్ కార్యకలాపాలను నియంత్రించడానికి రష్యా చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగానే ఈ బ్యాన్ అంటూ పలు టెక్ కంపెనీలు, మానవ హక్కుల సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. 2022లో ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైనప్పటి నుంచి విదేశీ టెక్ కంపెనీలపై రష్యా కఠిన ఆంక్షలు విధిస్తోంది.
