ధర్మపురి అర్వింద్‌‌, జగ్గారెడ్డి క్షమాపణ చెప్పాలి : తెలంగాణ పోలీసు అధికారుల సంఘం

ధర్మపురి అర్వింద్‌‌, జగ్గారెడ్డి క్షమాపణ చెప్పాలి : తెలంగాణ పోలీసు అధికారుల సంఘం
  • తెలంగాణ పోలీసు అధికారుల సంఘం డిమాండ్​

హైదరాబాద్‌‌, వెలుగు: మున్సిపల్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీసులను ఉద్దేశించి నిజా మాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌, పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన అనుచిత, బెదిరింపు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలంగాణ పోలీసు అధికారు ల సంఘం పేర్కొన్నది. రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహిస్తున్న పోలీసులను  అసభ్యకర పదజాలంతో బెదిరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన చర్యగా పరిగణిస్తు న్నామని తెలిపింది.

ఈ మేరకు సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టబద్ధంగా విధులు నిర్వహించిన అధికారులను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకొని బెదిరింపులకు పాల్పడడం ప్రజా ప్రతినిధి ప్రవర్తన కాదని అన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు పోలీసు సిబ్బంది మనోబలాన్ని దెబ్బతీయడమే కాక, శాంతి భద్రతల పరిరక్షణలో పనిచేస్తున్న వ్యవస్థపై అనవసరమైన అపనమ్మకాన్ని సృష్టిస్తాయని పేర్కొన్నారు. అర్వింద్‌‌, జగ్గారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు, బూతు మాటలు, బెదిరింపు వ్యాఖ్యలను వెం టనే ఉపసంహరించుకొని.. పోలీసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌ చేశారు.