న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మంచి వాగ్ధాటిగల నాయకుడు. హిందీ, ఇంగ్లీష్ భాషలలో అనర్గళంగా మాట్లాడే ఆయన హాస్యంతో కూడిన ప్రసంగాలతోనూ అందరినీ ఆకట్టుకునేవారు. ఈ విషయం పార్లమెంట్లో ఎన్నోసార్లు నిరూపితమైంది. పార్లమెంటులో ప్రభావవంతమైన ప్రసంగాలు, సందర్భానుసారంగా హాస్యాన్ని పండిచడం ఆయన స్పెషల్. ప్రతిపక్ష నేతలు కూడా మంత్రముగ్ధులు అయ్యేవారంటే ఆయన ఎంతటి వాగ్దాటి గల నేతనో అర్ధం చేసుకోవచ్చు.
ఈ క్రమంలోనే వాజ్‌పేయి చమత్కారం, పదునైన కామెడీ టైమింగ్ ఎలా ఉండేదో ఆయనతో అత్యంత దగ్గరగా ప్రయాణం చేసిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. గురువారం (డిసెంబర్ 25) వాజ్‌పేయి 101 జయంతి వేడుకల్లో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్.. వాజ్‌పేయి కామెడీ టైమింగ్‌కు సంబంధించి ఒక పాత సంఘటనను గుర్తు చేశారు.
‘‘1999లో వాజ్‌పేయి పాకిస్తాన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆయన స్పీచ్‌కు మంత్రముగ్ధురాలైన ఒక అవివాహిత పాకిస్తానీ మహిళ తనను పెళ్లి చేసుకుని బదులుగా కాశ్మీర్ ఇస్తారా అని వాజ్‌పేయిని అడిగింది. వెంటనే స్పందించిన వాజ్‌పేయి.. నిన్ను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా.. కానీ కట్నం కింద పాకిస్తాన్ మొత్తాన్ని కావాలని సదరు మహిళకు తనదైన వాక్చాతుర్యంతో బదులిచ్చారు. వాజ్‌పేయి కామెడీ టైమింగ్‌కు సమావేశంలో ఉన్నవారంతా నవ్వారు’’ అని పాత సంఘటనను గుర్తు చేసుకున్నారు రాజ్‌నాథ్ సింగ్.
►ALSO READ | ఒడిషాలో భారీ ఎన్ కౌంటర్.. మావోయిస్ట్ పార్టీ టాప్ లీడర్ గణేష్ ఉయికే సహా ఆరుగురు మృతి
ఇదే కాకుండా మరో ఘటనను కూడా గుర్తు చేశారు. 2006లో ఇరాక్‌లో చమురు-ఆహార ఒప్పంద వివాదంతో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కుదేలైంది. దీనితో అప్పటి విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ను కాపాడటానికి నట్వర్ సింగ్‌ను బలిపశువును చేశారా అని కొంతమంది జర్నలిస్టులు వాజ్‌పేయిని ప్రశ్నించగా.. ‘నేను శాఖాహారిని’ అంటూ తనదైన శైలీలో ఆయన బదులిచ్చారని గుర్తు చేశారు.
