మరో పదేళ్ల పాటు కాంగ్రెస్‌దే అధికారం : మంత్రి కోమటిరెడ్డి రెడ్డి

మరో పదేళ్ల పాటు కాంగ్రెస్‌దే అధికారం :  మంత్రి కోమటిరెడ్డి రెడ్డి
  • నల్గొండ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి రెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలో పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పలు డివిజన్లలో కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థుల తరఫున రోడ్ షో నిర్వహించారు. నల్గొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకే మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చామని తెలిపారు. కార్పొరేషన్‌గా మారడంతో కేంద్ర, రాష్ట్ర నిధులతో నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.700 కోట్లతో బైపాస్ రోడ్డు సహా కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. 34వ డివిజన్‌లోని బక్కతాయి కుంటను ఆహ్లాదకరంగా అభివృద్ధి చేస్తానని, నల్గొండ అభివృద్ధికి ఎంత నిధులైనా తీసుకొస్తానని హామీ ఇచ్చారు.

ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో పాటు అన్ని డివిజన్ల పార్టీ అభ్యర్థులను రికార్డు మెజార్టీతో గెలిపించాలని కోరారు. డాక్టర్ హఫీజ్ ఖాన్, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్ముల మోహన్ రెడ్డి, పాశం రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ అభ్యర్థులు ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, గుమ్ముల జానకి మోహన్ రెడ్డి, రేగట్టె అండాలు లింగస్వామి, కౌసర్, ఆతియా కౌసర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.