- కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకరికొకరు సాయం
- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి వెలిచాల రాజేందర్ రావు
కరీంనగర్, వెలుగు: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వేర్వేరు కాదని, ఇద్దరు ఒకటేనని కరీంనగర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జి వెలిచాల రాజేందర్ రావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత పంచాయతీ ఎన్నికల్లో ఒకరు అభ్యర్థిని నిల్చోబెట్టిన చోట మరొకరు పోటీలో పెట్టలేదని, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఒకరికొకరు సాయం చేసుకుంటున్నారని ఆరోపించారు. బండి సంజయ్ హిందువులను మభ్యపెడితే, గంగుల కమలాకర్ ముస్లింలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తోందని, లబ్ధిదారులే తమ 66 మంది అభ్యర్థులను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
డంపింగ్ యార్డు సమస్యకు త్వరలో పరిష్కారం..
‘కరీంనగర్ ప్రజలకు దశాబ్దాలుగా డంపింగ్ యార్డు ఇబ్బందికరంగా మారింది. ఈ సమస్యను పరిష్కరిస్తామని ఇటీవల చొప్పదండి సభలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కరీంనగర్ ఔటర్ రింగు రోడ్డుతో సిటీ పారిశ్రామిక, ఆర్థిక ముఖచిత్రం మారబోతోంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని సుడా మాస్టర్ ప్లాన్ లో చేర్చాం. మానేరు డ్యామ్ లో భారీ అంబేద్కర్ విగ్రహం, మ్యూజియం ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయిస్తున్నాం. కేబుల్ బ్రిడ్జిపై డైనమిక్ లైటింగ్ ను త్వరలోనే పునరుద్ధరిస్తాం. కరీంనగర్ లో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తాం.’ అని వివరించారు.
బల్దియాలో అవినీతిపై ఎంక్వైరీ చేయిస్తాం..
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి స్మార్ట్ సిటీ పనుల్లో రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడినట్లు వెలిచాల ఆరోపించారు. వాటిపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ ఎంక్వైరీ చేయిస్తామన్నారు. కాంగ్రెస్ మేయర్ వచ్చాక విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.కబ్జాదారులకు మళ్లీ బీఆర్ఎస్ టికెట్లు ఇస్తే... కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అవినీతి అనకొండలను బీజేపీలో చేర్చుకుని, అసలైన కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా వారి గొంతుకోశారని వెలిచాల పేర్కొన్నారు.
