కెనాల్‌లో గల్లంతైన దంపతుల కోసం గాలింపు

కెనాల్‌లో గల్లంతైన దంపతుల కోసం గాలింపు

హాలియా, వెలుగు: నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద శనివారం రాత్రి కారు అదుపుతప్పి ఎన్ఎస్పీ కెనాల్‌లో పడిన ప్రమాదంలో గల్లంతైన తల్లం పుల్లయ్య దంపతుల  ఆచూకీ కోసం ఆదివారం రెవెన్యూ, పోలీస్, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంలో భార్య పద్మ మృతదేహాన్ని, కాల్వలో పడిన కారును సంఘటన జరిగిన కొద్ది దూరంలో గుర్తించగా, భర్త పుల్లయ్య ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు.

ఘటన స్థలాన్ని కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదివారం ఉదయం సందర్శించి వివరాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. శనివారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో త్రిపురారం మండలం కంపసాగర్‌కు చెందిన దంపతులు పుల్లయ్య, పద్మలు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తు కాల్వలో పడింది. రాత్రి కావడంతో గాలింపులో అంతరాయం ఏర్పడగా, ఆదివారం ఉదయం కారుతో పాటు పద్మ మృతదేహాన్ని బయటకు తీసినట్లు వెల్లడించారు. పుల్లయ్య మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది.