భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బుధవారం (డిసెంబర్ 24) అర్ధరాత్రి భద్రతా దళాలు, మావోయిస్ట్‌ల మధ్య భీకర ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో మావోయిస్ట్ పార్టీ టాప్ లీడర్ గణేష్ ఉయికేతో సహా ఆరుగురు మావోలు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటన కంధమాల్ జిల్లా బెల్హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.
మావోలు సంచరిస్తున్న సమాచారం మేరకు కోటగడ్‌లో ఒడిశా స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) బలగాలు, సీఆర్పీఎఫ్ బృందం సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత దళాలు, మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య పరస్పరం ఫైరింగ్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతుల్లో మావోయిస్ట్ పార్టీ టాప్ లీడర్ గణేష్ ఉయికే ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
గణేష్ తలపై రూ.1.10 లక్షల రివార్డ్ ఉంది. అతడి స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా పుల్లెంల గ్రామం. సుమారు 40 ఏళ్లు ఉద్యమంలో ఉన్న గణేష్ ఉయికే.. ఒడిషాలో మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాల్లో కీలక బాధ్యతల్లో పని చేశారు. అటవీ ప్రాంతంలో మావోయిస్ పార్టీ బలాన్ని పెంచడంలో అతడిది కీలక పాత్ర. భద్రతా దళాలపై మావోయిస్టులు చేసిన పలు దాడుల్లో గణేష్ ప్రధాన సూత్రధారి అని అధికారులు తెలిపారు.
మృతి చెందిన మరో ఇద్దరు మగ నక్సలైట్లలో ఒకరు మావోయిస్ట్ ఏరియా కమిటీ సభ్యుడు బారి అలియాస్ రాకేష్, మరొకరు అమృత్లుగా గుర్తించారు. వారి ఇద్దరు తలపై రూ 23.66 లక్షల బహుమతి ప్రకటించబడిందని పోలీసు అధికారులు వెల్లడించారు. సంఘటన ప్రాంతంలో ఒక రివాల్వర్, 303 రైఫిల్, ఒక వాకీటాకీను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఘటన స్థలంలో సెర్చింగ్ కొనసాగుతోందని తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ ద్వారా ఒడిశాలో మావోయిస్టులపై భద్రతా దళాలు భారీ విజయం సాధించాయి.
