- ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి పేరుతో యాదగిరిగుట్ట పట్టణాన్ని మాజీ సీఎం కేసీఆర్ ఆగం చేశారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆదివారం యాదగిరిగుట్టలోని 4, 5, 6, 7, 8 వార్డుల్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. యాదగిరిగుట్ట గుడి పేరు చెప్పి కేసీఆర్ పేదల పొట్ట కొట్టారని, ఆటోలను కొండపైకి నిషేధించి ఆటో కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేశారని విమర్శించారు.
అభివృద్ధి పేరుతో భూములు, ఇండ్లు, దుకాణాలను కూలగొట్టి నామమాత్రంగా పరిహారం చెల్లించి నిర్వాసితులకు తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఆటోలను తిరిగి కొండపైకి అనుమతించి ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కాటబత్తిని స్వప్న ఆంజనేయులు, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
