న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ అటాక్‌కు ప్రతీకారంగా భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గాయాల నుంచి పాకిస్తాన్ ఇంకా కోలుకోలేదు. భారత బలగాలు చేసిన ప్రతిదాడుల్లో పాక్‌లోని పలు ఎయిర్ బేస్‌లు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. అందులో భోలారి ఎయిర్ బేస్ కూడా ఒకటి. ఆపరేషన్ సిందూర్ దాడుల్లో ఆ స్థావరంలోని హ్యాంగర్‌కు భారీగా నష్టం జరిగింది. ఆ హ్యాంగర్‌కు పాకిస్తాన్ రిపేర్లు చేస్తున్న దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
హ్యాంగర్ రూఫ్‌ను పూర్తిగా తొలగించి దానిపై టార్పాలిన్ కప్పారు. వాంటోర్ సంస్థకు చెందిన శాటిలైట్లు ఈ ఏడాది జనవరి 28న ఆ హ్యాంగర్ ఫొటోలు తీశాయి. దీంతో హ్యాంగర్‌ను పాక్ ఎయిర్ ఫోర్స్ పునర్నిర్మిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. డ్యామేజ్ అయిన ప్రాంతాన్ని టార్పాలిన్‌తో కప్పినా కూడా ధ్వంసమైన మిగతా భాగం ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే, పాక్‌కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రాబ్ 2000 విమానాన్ని కూడా భారత బలగాలు ధ్వంసం చేశాయి.
ఇక, డ్యామేజ్ అయిన ఇతర ఎయిర్ బేస్‌లలో కూడా రీకన్ స్ట్రక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ధ్వంసమైన భాగాలను తొలగించి కొత్త రూఫ్‌లు నిర్మిస్తున్నారు. శకలాలను పూర్తిగా క్లియర్ చేస్తున్నారు. కాగా.. సుక్కూర్‌లోని మురీద్ ఎయిర్ బేస్ కూడా భారత బలగాల దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నది. అక్కడ కూడా రిపేర్ పనులు జరుగుతున్న దృశ్యాలు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. దెబ్బతిన్న రూఫ్ బిల్డింగ్‌ను ఎర్రటి టార్పాలిన్ తో కప్పారు. ఇక, కీలక నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లోని కమాండ్ కంట్రోల్ కూడా డ్యామేజ్ అయింది.
