టెహ్రాన్: ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మాజీ సీనియర్ కమాండర్ హుస్సేన్ కనాని ప్రపంచ దేశాలు ఉలిక్కిపడే వ్యాఖ్యలు చేశారు. సౌదీ అరేబియా దగ్గర భూగోళానికి, యావత్ మానవాళి మనుగడకు అత్యంత ప్రమాదకరమైన అణ్వాయుధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు. సౌదీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్న సంగతి అమెరికా, ఇజ్రాయెల్‌కు కూడా తెలుసని బ్లాస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సౌదీ అరేబియా తనను తాను అణ్వాయుధ రహిత దేశంగా ప్రపంచానికి చెప్పుకుంటున్నప్పటికీ అది నిజం కాదన్నాడు. సౌదీ అరేబియా అణ్వాయుధ దేశమని పునరుద్ఘాటించాడు. ఈ విషయంపై సౌదీ అరేబియా, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య చర్చలు కూడా జరిగాయని ఆరోపించాడు.
ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇరాన్ అణు బాంబును తయారు చేస్తే మరుసటి రోజే సౌదీ అరేబియా అణ్వాయుధ దేశంగా మారుతుందని కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హుస్సేన్ కనాని చేసిన తాజా కామెంట్స్ వాన్స్ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తున్నాయి.
సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య కీలక ఒప్పందం:
2025, సెప్టెంబర్‌లో మిత్ర దేశాలైన పాకిస్తాన్, సౌదీ అరేబియా మధ్య కీలకమైన పరస్పర వ్యూహాత్మక రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్, సౌదీ రెండింటిలో ఏ దేశంపై దాడి జరిగినా దానిని రెండు దేశాలపై దాడిగానే పరిగణిస్తారు. ఇరుదేశాల మధ్య ఈ ఒప్పందం లోతైన సైనిక సహకారాన్ని అందిస్తుంది. ఈ అగ్రిమెంట్లో భాగంగానే సౌదీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి పాకిస్తాన్ తన అణు కార్యక్రమాన్ని లీక్ చేసిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
