ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్కీలే కాక సామాన్యులకు కూడా మైండ్ బ్లాక్ అయ్యే వార్త. ఇంటర్నెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రేటుకు ఒక డొమైన్ పేరు అమ్ముడైంది. కేవలం రెండు అక్షరాలు.. అదే AI.com. దీనిని అప్పట్లో కొన్నది జస్ట్ రూ.300కే అయినా అమ్మిన రేటు చూస్తే నోరెళ్లబెట్టేస్తారు. అరే ఏంట్రా ఇది ఏఐకి ప్రస్తుతం ఇంత క్రేజ్ ఉందా అని మీరే షాకైపోతారు ఈ వాస్తవాలు తెలుసుకుంటే..
రూ.300 పెట్టుబడి.. రూ.634 కోట్ల లాభం
ఈ స్టోరీ వింటే సినిమాల్లో ఇలాంటివి జరుగుతాయ్ అనిపిస్తుంది. మలేషియాకు చెందిన అర్స్యన్ ఇస్మాయిల్ అనే టెక్ ఎంట్రప్రెన్యూర్ 1993లో తన 10 ఏళ్ల వయసులో ఉండగా తల్లి క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏఐ.కామ్ అనే డొమైన్‌ను కొన్నాడు. అప్పట్లో అతను చెల్లించిన రేటు రూ.300. చాలా ఏళ్ల తర్వాత కథ మెుత్తం మారిపోయింది. చిత్రమైన విషయం ఏంటంటే.. అతను ఏఐ మీద ఉన్న పిచ్చితో దానిని కొనలేదంట. అతని పేరులోని మొదటి అక్షరాలు 'AI' కావడంతో సరదాగా కొనుక్కున్నాడు. అప్పట్లో అతని తల్లికి అసలు డొమైన్ అంటే ఏంటో కూడా తెలియక.. క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్‌లో ఆ చార్జీలు చూసి తల పట్టుకుందట. కానీ ఇప్పుడు అదే అతనికి కోట్లు కురిపించింది.
ఎందుకు ఇంత క్రేజ్..?
ప్రస్తుతం ప్రపంచమంతా 'ఏఐ' జపం చేస్తున్న సంగతి తెలిసిందే. టెక్ దిగ్గజ కంపెనీల మధ్య ఏఐ వార్ నడుస్తున్న వేళ.. ఈ రంగంలో ఆధిపత్యం చలాయించాలంటే AI.com అనే పేరును మించిన బ్రాండ్ మరొకటి లేదు. అందుకే Crypto.com సీఈవో క్రిస్ మార్జాలెక్ ఏకంగా రూ.634 కోట్లు క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించి మరీ ఈ డొమైన్‌ను దక్కించుకోవటం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. ఇది 2010లో జరిగిన CarInsurance.com డొమైన్ 49.7 మిలియన్ డాలర్ల డీల్‌ను అధిగమించింది. ఇంటర్నెట్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన పబ్లిక్ డొమైన్ సేల్‌గా ఏఐ.కామ్ ప్రస్తుతం రికార్డు సృష్టించింది.
క్రిస్ మార్జాలెక్ ఈ వెబ్‌సైట్ ద్వారా ఒక భారీ కన్స్యూమర్ ఏఐ ప్లాట్‌ఫారమ్ లాంచ్ చేయబోతున్నారు. సూపర్ బౌల్ ప్రకటన ద్వారా దీనిని ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. మీ పనులను చక్కబెట్టే ఏఐ ఏజెంట్లు, స్టాక్ ట్రేడింగ్, మెసేజింగ్ వంటి సేవలను ఈ ప్లాట్‌ఫారమ్ అందించనుంది. ఈ టచ్ పాయింట్ మా దగ్గర లేకపోతే.. తాము కూడా మార్కెట్‌లో ఒక మామూలు సాదాసీదా కంపెనీలాగా మిగిలిపోతాం అంటూ క్రిస్ డొమైన్ కొనుగోలు వెనుక ఉన్న వ్యూహాన్ని వెల్లడించారు.
చిన్నప్పుడు సరదాగా కొన్న వెబ్ డొమైన్ ఒక వ్యక్తిని వందల కోట్ల అధిపతిని చేయడమే కాదు.. టెక్ ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీసింది. ఇంటర్నెట్ యుగంలో 'పేరు' కి ఉన్న పవర్ ఇదే మరి అంటున్నారు నిపుణులు. సో ప్రస్తుతం ఈ క్రేజీ డీల్ ప్రపంచం మెుత్తాన్ని ఉలిక్కిపరుస్తోంది.
