12 ఏళ్ల న్యాయ పోరాటం.. పోయిన బంగారానికి రూ.43 లక్షలు ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి.. అదే కాపాడింది!

12 ఏళ్ల న్యాయ పోరాటం.. పోయిన బంగారానికి రూ.43 లక్షలు ఇన్సూరెన్స్ పొందిన వ్యక్తి.. అదే కాపాడింది!

బంగారం అంటే భారతీయులకు కేవలం జస్ట్ మెటల్ కాదు. అదొక సెంటిమెంట్.. పైగా ఆర్థిక భరోసా. అయితే ఆ బంగారం పోయినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు సాకులు చెప్పి క్లెయిమ్ తిరస్కరిస్తే ఆ బాధ వర్ణనాతీతం. సరిగ్గా ఇలాంటి ఒక కేసులో 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఒక భర్త తన భార్య బంగారానికి సంబంధించి రూ.43 లక్షల పరిహారాన్ని గెలుచుకున్నారు. ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఇచ్చిన సంచలన తీర్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

ప్రవీణ్ కుమార్ శర్మ అనే వ్యక్తి 2009 డిసెంబర్‌లో తన భార్య వద్ద ఉన్న రూ.18లక్షల 37వేల విలువైన బంగారు ఆభరణాలకు 'హౌస్‌హోల్డ్ ఇన్సూరెన్స్' పాలసీ తీసుకున్నారు. పాలసీ తీసుకున్న కొద్ది రోజులకే అంటే 2010 జనవరి 7న.. తన స్కూటర్‌పై నరేలా వెళ్తుండగా జేబులో ఉన్న బంగారు నగల పౌచ్ జారిపోయింది. వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం అందించారు. సర్వేయర్ కూడా రూ.17లక్షల 75వేల నష్టం జరిగిందని ధృవీకరించారు.

ఇన్సూరెన్స్ కంపెనీకి కోర్టు చీవాట్లు..
అయితే ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ క్లెయిమ్‌ను తిరస్కరించింది. నగలు జాగ్రత్తగా చూసుకోవడంలో యజమాని అశ్రద్ధ వహించారని.. అసలు కొన్న బిల్లులు లేవని, ఆయన చెప్పిన కథనం నమ్మశక్యంగా లేదంటూ సాకులు చెప్పింది. దీనిపై ప్రవీణ్ వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ తర్వాత.. ఇన్సూరెన్స్ కంపెనీ వాదనలను కోర్టు కొట్టిపారేసింది. పాలసీ ఇచ్చేటప్పుడే వాల్యుయేషన్ రిపోర్ట్‌ను అంగీకరించి.. ప్రీమియం తీసుకున్న తర్వాత.. ఇప్పుడు నగలు ఉన్నాయా లేదా అని ప్రశ్నించే హక్కు కంపెనీకి లేదంటూ కోర్టు స్పష్టం చేసింది.

రూ.18 లక్షలు కాస్తా రూ.43 లక్షలు ఎలా అయ్యాయి?
జిల్లా కమిషన్ ఇచ్చిన తీర్పును ఢిల్లీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ సమర్థించింది. ఇన్సూరెన్స్ కంపెనీ సేవా లోపం చేసినట్లు నిర్ధారించి.. రూ.17లక్షల 75వేల అసలు మొత్తానికి 2010 నుండి 9 శాతం వడ్డీని చెల్లించాలని ఆదేశించింది. దీనికి అదనంగా మరో రూ.50 వేల నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఆదేశించింది. వడ్డీతో కలిపి ఈ మొత్తం ఇప్పుడు సుమారు రూ.43 లక్షలకు పైగా చేరింది. సాకులు చెప్పి క్లెయిమ్‌ను తిరస్కరిస్తే కంపెనీలకు అసలు కంటే వడ్డీయే భారమవుతుందని తాజా తీర్పు హెచ్చరికలా మారింది.

గోల్డ్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు గమనించాల్సిన విషయాలు..?
ఈ కేసు నుంచి ఇన్సూరెన్స్ కొనుగోలుదారులు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కేవలం దొంగతనం, అగ్నిప్రమాదాలే కాకుండా ఆల్ రిస్క్ పాలసీని ఎంచుకోవడం మంచి ఆప్షన్ అని కేసు చెబుతోంది. నగలు పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ముఖ్యంగా పాలసీ తీసుకునే సమయంలోనే అన్ని పత్రాలు, వాల్యుయేషన్ రిపోర్టులు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు చూసుకోవాలి. అప్పుడే ఇన్సూరెన్స్ కంపెనీలు టెక్నికల్ కారణాలతో క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉండదు. బంగారం విలువ నిరంతరం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో.. సరైన ఇన్సూరెన్స్ ఉండటం మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అలాగే పాలసీ తీసుకునే సమయంలో నిజాయితీగా అన్ని విషయాలు తెలియజేయటం ఒక్కటే చివరికి మిమ్మల్ని కాపాడుతుందని గుర్తుంచుకోండి.