న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ అపొజిషన్ లీడర్ రాహుల్ గాంధీ జర్మనీ పర్యటనపై బీజేపీ చేస్తోన్న విమర్శలకు ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్ సామ్ పిట్రోడా కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు వెళ్లి.. ఇతర దేశాల ముందు భారత్ పరువు తీస్తున్నారన్న బీజేపీ ఆరోపణలను తోసిపుచ్చారు. రాహుల్ గాంధీ భారతదేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా ఒకే విధంగా మాట్లాడుతారని స్పష్టం చేశారు. ఇండియాలో ఒకలా మాట్లాడి.. విదేశాల్లో మరోలా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ సమావేశాలతో జార్జ్ సోరోస్‌కు సంబంధం ఉందని చెప్పడం అర్ధంలేని ఆరోపణలని కొట్టిపారేశారు.
రాహుల్ విదేశీ పర్యటనల సమయంలో విదేశీ నాయకులు, సంస్థలు అతడిని కలవకుండా మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సమయంలోనే రాహుల్ జర్మనీ పర్యటనకు వెళ్లడంపై పిట్రోడా క్లారిటీ ఇస్తూ.. అంతర్జాతీయ పర్యటనలు చాలా ముందుగానే షెడ్యూల్ చేయబడతాయని.. వాటిని మార్చలేమని అన్నారు. జర్మనీ పర్యటనలో భాగంగా 100కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరైన ప్రోగ్రెసివ్ అలయన్స్ సమావేశానికి రాహుల్ హాజరయ్యారని తెలిపారు.
►ALSO READ | అసలేం జరుగుతోంది..? బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడిని కొట్టి చంపిన దుండగులు
భారతదేశంలో ప్రజాస్వామ్యం హరించుకుపోతుందని రాహుల్ జర్మనీలో చేసిన వ్యాఖ్యలు కొత్తేమి కాదని.. ఇండియాలో కూడా అతడు ఇలాంటి వ్యాఖ్యలు చాలాసార్లు చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలు కీలు బొమ్మలుగా మారుతున్నాయని.. ప్రజాస్వామ్యం పూర్తి స్థాయి దాడికి గురవుతోందని రాహుల్ పదే పదే లేవనెత్తుతారని గుర్తు చేశారు.
మహ్మాత గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపైన సామ్ పిట్రోడా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహ్మాత గాంధీ పేరు తొలగించి రాముడి పేరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ప్రధాని మోడీ పని దేశాన్ని నడపడం అంతేకానీ ఏ ప్రత్యేక సమాజానికి ప్రాతినిధ్యం వహించడం కాదని చురకలటించారు. ఆయన ఏ ఒక్క సమాజానికి ప్రధానమంత్రి కాదు అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు.
