- సెలవుకు ముందు, తర్వాతి రోజు లీవ్ పెడ్తున్న ఆఫీసర్లు
- సెక్రటేరియెట్ మొదలు మండలాఫీసుల దాకా ఇదే తీరు
- వీకెండ్‌లోనూ అంతే.. శనివారం మధ్యాహ్నమైందంటే జంప్
- పని దినాల్లోనూ 12 గంటలకు వచ్చుడు.. 4 గంటలకే పోవుడు
- సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న జనాలకు తప్పని ఇబ్బందులు
హైదరాబాద్, వెలుగు: పండుగొచ్చిందంటే చాలు.. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. పండుగకు ముందు, తర్వాత రోజు అధికారులు, సిబ్బంది సెలవు పెట్టి వెళ్తున్నారు. పండుగ సెలవు ఒక్కరోజే ఉన్నప్పటికీ, ఆఫీసులు మాత్రం రెండు, మూడు రోజుల పాటు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సెక్రటేరియెట్ మొదలుకుని మండల ఆఫీసుల దాకా ఇదే పరిస్థితి నెలకొన్నది. పండుగ మూడ్‌లో ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. దీంతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలు అధికారుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. గురువారం క్రిస్మస్, శుక్రవారం బాక్సింగ్ డే హాలీడేస్ ఉండడం, ఆ తర్వాత శని, ఆదివారాలు కావడంతో.. బుధవారం అరకొర సిబ్బందే కార్యాలయాలకు వచ్చారు. వాళ్లు కూడా మధ్యాహ్నానికే ఆఫీసుల నుంచి వెళ్లిపోవడం కనిపించింది. సెక్రటేరియెట్‌లో ఫ్లోర్‌కు ఒక సెక్రటరీ అన్నట్టుగా ఐదుగురు కంటే ఎక్కువ మంది కనిపించలేదు.
సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం ఐఏఎస్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి.. విధుల్లో అలసత్వం వహించవద్దని, ప్రజలకు అందుబాటులో ఉండాలని హెచ్చరించారు. కానీ మరుసటి రోజే చాలామంది ఉన్నతాధికారులు విధులకు డుమ్మా కొట్టారు. బుధవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు వంటి అధికారులే తమ చాంబర్లలో కనిపించలేదు. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియెట్‌లో ఐదుగురు సెక్రటరీలు మాత్రమే అందుబాటులో ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక చీఫ్ మినిస్టర్ ఆఫీసు (సీఎంవో)లోనూ ఇదే తీరు కనిపిస్తున్నది. అక్కడ ఉండే కీలకమైన కార్యదర్శులు ఆఫీసుకు ఎప్పుడు వస్తారో? ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. సీఎంతో బ్రీఫింగ్ ఉన్న సమయంలో వాళ్లు ఎలాగూ ప్రజలకు అందుబాటులో ఉండరు. కానీ మిగతా సమయాల్లో, సీఎం జిల్లాల పర్యటనకు వెళ్లిన టైమ్‌లోనూ వాళ్లు చాంబర్లలో ఉంటలేరు. ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఓఎస్డీ శ్రీనివాసులు మినహా మిగతా సెక్రటరీలు ఉన్నారా?లేరా? అన్నది తెలియడం లేదు. అసలు వీరు ఎవరిని కలుస్తున్నారు? ఎక్కడ ఉంటున్నారు? అన్నది అంతుచిక్కడం లేదు. ఐఏఎస్ అధికారులే ఉంటలేరని సాకుగా చూపిస్తూ అదనపు సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీల నుంచి మొదలుకొని సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల వరకు అందరూ ఇదే బాటలో పయనిస్తున్నారు.
జిల్లా, మండల కేంద్రాల్లోనూ అంతే..
సెక్రటేరియెట్ లెక్కనే జిల్లా, మండల కార్యాలయాల్లోనూ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వ్యవసాయం, రెవెన్యూ, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖల అధికారులు ఉదయం 11 గంటలు దాటినా కార్యాలయాలకు రావడం లేదు. వచ్చినా కాసేపటికే మీటింగ్ ఉందంటూ బయటకు వెళ్లిపోతున్నారు. సామాన్య ప్రజలు ఎక్కువగా వెళ్లేది మండల కార్యాలయాలకే. కానీ అక్కడ పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీసుల్లో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పండుగ వచ్చిందంటే చాలు.. ఈ కార్యాలయాల్లో సగం మంది సిబ్బంది సెలవు పెట్టకుండానే డుమ్మా కొడుతున్నారు. దీంతో కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం, భూసమస్యల పరిష్కారం, ఇతరత్రా పనుల మీద వచ్చే జిల్లా, మండల కేంద్రాలకు వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వీకెండ్‌లోనూ జంప్..
సాధారణ పనిదినాల్లో సైతం అధికారులు, ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదు. ఉదయం 10:30 గంటలకు కార్యాలయాల్లో ఉండాల్సిన సిబ్బంది.. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా రావడం లేదు. తీరా 12 గంటలకు ఆఫీసులకు చేరుకున్నా, గంట సేపు కూడా పని చేయకుండానే లంచ్ బ్రేక్ పేరుతో బయటకు వెళ్లిపోతున్నారు. తిరిగి సీట్లలోకి వచ్చేసరికి మధ్యాహ్నం 3 గంటలు దాటుతోంది. మళ్లీ సాయంత్రం 4 గంటలు అయిందంటే చాలు, బ్యాగులు సర్దుకుని ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండో శనివారం మాత్రమే సెలవు. కానీ వారాంతం వచ్చిందంటే చాలు యంత్రాంగం మొత్తం రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లిపోతున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే సొంత పనుల మీద, ఊర్ల ప్రయాణాల మీద దృష్టి సారించే అధికారులు.. శనివారం కార్యాలయాల్లో సంతకం పెట్టి వెళ్లిపోతున్నారు. మధ్యాహ్నం తర్వాత ఏ ప్రభుత్వ ఆఫీసులో చూసినా పట్టుమని పదిమంది ఉద్యోగులు కూడా కనిపించని దుస్థితి నెలకొంది.
జిల్లాల్లో బుధవారం పరిస్థితి ఇదీ..
- వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్‌లోని ఎంపీడీవో ఆఫీస్ బుధవారం ఉదయం 11 గంటలైనా తెరచుకోలేదు.
- ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ టీచర్లంతా బుధవారం ఆప్షనల్ హాలిడే తీసుకున్నారు. దీంతో స్కూళ్లు తెరుచుకోలేదు. మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో చాలామంది ఉద్యోగులు ఆప్షనల్ హాలిడే పెట్టుకొని ఇండ్లకే పరిమితమయ్యారు. ఇక సోమవారం దాకా కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. గుడిహత్నూర్ ఎంపీడీవో కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు సెలవులో ఉండగా, మరో ఇద్దరు ఆప్షనల్ హాలిడే పెట్టుకోగా..
- మిగతా ముగ్గురు మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లిపోయారు.
- నాగర్కర్నూల్జిల్లాలోని డివిజన్ ఆఫీసులన్నీ మధ్యాహ్నానికి ఖాళీ అయ్యాయి. పెద్దసంఖ్యలో ఉద్యోగులు ఆప్షనల్ హాలిడే తీసుకున్నారు. జడ్పీ, డీపీవో స్టాఫ్ మధ్యాహ్నం కల్లా వెళ్లిపోయారు. ఇదేమని అడిగితే గ్రామ
- పంచాయితీ ఎన్నికల డ్యూటీలతో అలసిపోయామని చెప్పారు.
- వనపర్తి కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులు మధ్యాహ్నం నుంచే వెళ్లిపోయారు. మార్కెట్ కమిటీ, ఇరిగేషన్, ఆర్అండ్బీ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఆఫీసుల్లో 25 శాతం కంటే ఎక్కువ సిబ్బంది లేరు.
- కరీంనగర్ కలెక్టరేట్‌లోని ట్రెజరీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగులు సెలవులో వెళ్లడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి.
