- వాషింగ్టన్లో ‘బోర్డ్ ఆఫ్ పీస్’ తొలి మీటింగ్‌లో స్పీచ్
- ఇరాన్‌ను చుట్టుముడుతున్న అమెరికా బలగాలు
- వారాంతంలోనే దాడి జరగొచ్చంటూ వార్తలు
వాషింగ్టన్: ఇరాన్ తమతో ఇప్పుడే డీల్ కుదుర్చుకోవాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ‘‘ఇరాన్ తప్పనిసరిగా ఒక ‘అర్థవంతమైన’ ఒప్పందం చేసుకోవాలి. ఒకవేళ ఇరాన్ అంగీకరించకపోతే, అమెరికా మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది” అంటూ ఆయన పరోక్షంగా సైనిక చర్యపై సంకేతాలిచ్చారు. గురువారం వాషింగ్టన్ లో 'బోర్డ్ ఆఫ్ పీస్' ప్రారంభ సమావేశంలో ట్రంప్ మాట్లాడారు.
స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో అమెరికా, -ఇరాన్ ప్రతినిధుల మధ్య పరోక్ష చర్చలు జరుగుతున్నప్పటికీ, ట్రంప్ తన హెచ్చరికల ద్వారా ఇరాన్‌కు స్పష్టమైన గడువు విధించారు. "చర్చలు బాగున్నాయి. కానీ ఇరాన్‌తో ఒప్పందం అంత సులభం కాదని చరిత్ర చెబుతోంది. మాకు ఫలితం కావాలి. లేదంటే రాబోయే 10 రోజుల్లో అసలు ఏం జరగబోతోందో మీకు తెలుస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌తో అర్థవంతమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇన్నాళ్లూ అంత సులభం కాలేదని, కానీ ఇప్పుడు అది జరగకపోతే "దుష్పరిణామాలు" ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
ఇరాన్‌పై దాడులు చేసే అవకాశం ఉందంటూ ఒక రోజు ముందే ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' ద్వారా సూచనప్రాయంగా తెలిపారు. మిడిల్ ఈస్ట్ లో అమెరికా భారీగా సైనిక బలగాలను మోహరిస్తున్న తరుణంలో తాజాగా ట్రంప్ మరోసారి హెచ్చరించడంతో ఇరాన్ పై దాడి తప్పదన్న వార్తలు వస్తున్నాయి.
ఇరాన్ ను చుట్టుముడుతున్న అమెరికా
అణుఒప్పందానికి సంబంధించి అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌పై దాడి చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ వారాంతం (శనివారం) నుంచి దాడిచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా దీనిపై ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని ప్రముఖ మీడియా సంస్థలు వెల్లడించాయి.
ఈ వీకెండ్ నుంచి దాడికి సిద్ధంగా ఉన్నామని వైట్ హౌస్‌కు అమెరికా ఆర్మీ సమాచారం ఇచ్చిందని.. కానీ, ట్రంప్ ఇంకా దాడికి ఒప్పుకోలేదని.. ఆయన దీని గురించి ఇంకా ఆలోచిస్తున్నాడని, సలహాదారులు, మిత్రదేశాలతో చర్చిస్తున్నాడని పేర్కొన్నాయి. కాగా, ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో భారీ సైనిక సమీకరణ జరుగుతోంది. యుద్ధనౌకలు, ఫైటర్ జెట్‌లు, రిఫ్యూలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ లు సహా మొత్తం 13 యుద్ధనౌకలను మోహరించినట్టు తెలిసింది.
