హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 20 నుంచి జలమండలి బస్తీబాట

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 20 నుంచి జలమండలి బస్తీబాట

హైదారాబాద్ నగరంలో జలమండలి  అధికారులు బస్తీ బాట పట్టనున్నారు. జలమండలి పరిధిలోని బస్తీలు, కాలనీల్లో పర్యటించి వాటర్, డ్రైనేజీ సమస్యలపై నేరుగా ప్రజలనుంచి ఫిర్యాదులు స్వీకరించి స్పాట్ లోనే సమస్యలను పరిష్కరించనున్నారు. 

జలమండలి  అధికారులు బస్తీబాట పేరిట స్పెషల్ ఫీల్డ్ విజిట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. శనివారం(ఫిబ్రవరి 20) నుంచి నగరంలోని బస్తీల్లో జలమండలి బస్తీ బాట నిర్వహించనున్నారు. అధికారులు బస్తీల్లో పర్యటించి ప్రజలను సమస్యలను తెలుసుకోనున్నారు. ఉచిత నీటి పథకం, ఆన్‌లైన్ బిల్లు చెల్లింపులు, కొత్త కనెక్షన్లు, నీటి కాలుష్య నివారణ వంటి సమస్యలను పరిష్కారం చూపనున్నారు. 

వారంలో నాలుగు రోజులపాటు బస్తీ బాట నిర్వహిస్తారు.ప్రతి మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో ఉదయం 7 గంటలనుంచి 10 గంటల వరకు బస్తీలు, కాలనీల్లో అధికారులు పర్యటించనున్నారు. ఎండీ స్థాయి నుంచి  వార్డు మేనేజర్ల వరకు క్షేత్రస్థాయిలో పాల్గొంటారు.  ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలపై ఫిర్యాదులను స్వీకరిస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కార్యాలయాల్లో సాధారణ విధులు నిర్వహిస్తారు. 

ఈ పర్యటనల్లో సీవరేజ్ మ్యాన్‌హోల్స్, పైప్‌లైన్ స్థితి, లీకేజీలు, ఓవర్‌ఫ్లో, డీసిల్టింగ్‌ లను పరిశీలించనున్నారు. వాటర్ పైప్‌లైన్ లీకేజీలు, లో-ప్రెషర్ సమస్యలు, నీటి సరఫరాపై తనిఖీలు చేయనున్నారు. 
నల్లాలకు మోటర్ల బిగింపు, నీటి వృథా నివారణపై చర్యలు చేపట్టనున్నారు. బస్తీల్లో తాత్కాలిక సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరిస్తారు. 

వార్డుల వారీగా శాశ్వత పరిష్కార  ప్రణాళిక రూపకల్పనకు ఎండీ, జాయింట్ ఎండీ, డైరెక్టర్లు, రీజియన్ ఈడీలు, జోన్ సీజీఎంలు, సర్కిల్ డీజీఎం లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి  ప్రజలతో మాట్లాడి  కంప్లైంట్స్ తీసుకుంటారు. 

ప్రతి పర్యటనపై వార్డు మేనేజర్ నుంచి సెంట్రల్ ఆఫీసు వరకు ఆన్ లైన్ ద్వారా రిపోర్టులు ఇవ్వనున్నారు. ప్రతి శనివారం సమీక్షా సమావేశం నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరిస్తారు.