- ఏర్పాట్లు చేయాలని రాష్ట్రాల సీఈవోలకు ఈసీ లేఖ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో 'సర్' ప్రక్రియ ఏప్రిల్ నుంచి జరగనుంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారుల(సీఈవో)కు ఈసీ గురువారం లేఖ రాసింది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక, హర్యానా, పంజాబ్, ఒడిశా, ఉత్తరాఖండ్, ఢిల్లీ వంటి కీలక రాష్ట్రాల్లో సర్ ప్రాసెస్ జరగనుంది. దీనికి సంబంధించిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.
చివరిసారిగా సర్ నిర్వహించిన 2002–2004 నాటి ఓటర్ లిస్టులో ప్రస్తుత ఓటర్లను మ్యాపింగ్ చేయాలని తెలిపింది. దీనిపై బూత్ లెవల్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని సూచించింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందే బిహార్ లో సర్ ప్రక్రియ పూర్తయ్యింది.
రెండోవిడతలో భాగంగా.. అక్టోబర్ 2025లో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ సహా 12 రాష్ట్రాల్లో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇది కొనసాగుతున్నది. కాగా..ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి జనగణన తొలి దశ ప్రారంభంకానుంది. సాధారణంగా జనగణన, సర్ ప్రాసెస్ రెండింటికీ ప్రభుత్వ ఉపాధ్యాయులనే వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో వారిపై భారం పడకుండా ఉండటానికి రెండు ప్రక్రియలను విడతల వారీగా నిర్వహించాలని ఈసీ భావిస్తోంది.
