- ఏఐ సెఫ్టీని ఆవిష్కరణలకు అడ్డంకి కాకుండా చూస్తాం: శ్రీధర్ బాబు
- రాష్ట్ర అభివృద్ధిలో ఏఐని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్తున్నాం
- గ్లోబల్ స్ట్రాటెజిక్ సంస్థల సదస్సులో మంత్రి ప్రసంగం
న్యూఢిల్లీ, వెలుగు: ప్రపంచంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్‌గా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఏఐ రంగంలో భద్రతను ఆవిష్కరణలకు అడ్డంకిగా కాకుండా, 21వ శతాబ్దపు ‘ఏరో డైనమిక్స్’గా చూస్తున్నామని పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ –2026’లో గురువారం ఆయన పాల్గొని, ప్రసంగించారు.
ఈ సందర్భంగా డిజిటల్ గవర్నెన్స్ అడ్వైజరీ, ఆల్ బ్రైట్ స్టోన్‌బ్రిడ్జ్ గ్రూప్ (డీజీఏఏఎస్‌జీ) లాంటి గ్లోబల్ స్ట్రాటెజిక్ అడ్వైజరీ సంస్థల ప్రతినిధులు, ఏఐ సేఫ్టీ కనెక్ట్ సంస్థల నిపుణులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచంలోనే అగ్రగామి ఏఐ హబ్‌గా ఎదగడం ద్వారా 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే తెలంగాణ లక్ష్యమని పేర్కొన్నారు.
తొలి నెట్ జీరో నగరంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’..
సుస్థిరతను ప్రధాన వృద్ధిగా తెలంగాణ ప్రభుత్వం ఏఐ టెక్నాలజీని క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్తోందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కేవలం మౌలిక సదుపాయాలకే పరిమితం కాకుండా.. 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ‘ఏఐ సిటీ’ని దేశంలోనే తొలి నెట్-జీరో నగరంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. దేశంలోనే మొట్టమొదటి ఏఐ హబ్ ‘ఐకామ్’ (ఏఐకామ్)ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
2027 నాటికి ఇంటిగ్రేటెడ్ డిజిటల్ సర్వీసెస్ ప్లాట్‌ఫారమ్ (ఐడీఎస్‌పీ) ద్వారా 4 కోట్ల మంది పౌరులకు 300కు పైగా ప్రభుత్వ సేవలను అరచేతిలోనే అందించనున్నట్లు వెల్లడించారు. మూసీ నది పునరుజ్జీవం నుంచి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తరగతి గదుల వరకు భవిష్యత్ కోసం 15 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పారు. సాంకేతికత అనేది... పీల్చే గాలిలాగా అత్యవసరంగా, అదృశ్యంగా, అన్నింటి కంటే మించి సురక్షితంగా ఉండే భవిష్యత్తు కోసం తాము శ్రమిస్తున్నామన్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
