బెంగళూరు: పెళ్లయి నెల కూడా కాకముందే, బెంగళూరులోని బాగల్గుంటేలో బుధవారం సాయంత్రం నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది. మద్దూరుకు చెందిన ఐశ్వర్యకు కొత్తగా పెళ్లైనది. నవంబర్ 27న బెంగళూరులోని మల్లసంద్రకు చెందిన లిఖిత్ సింహాకు, ఐశ్వర్యకు వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఐశ్వర్య భర్త ఆమెతో కలిసి ఉండేందుకు ఇష్టపడలేదు. ఆమెను పుట్టింటికి తీసుకెళ్లిపోవాలని ఐశ్వర్య తల్లిదండ్రులకు పదేపదే చెప్పాడు. ఈ విషయంలో పంచాయితీ కూడా నడిచింది.
బుధవారం ఉదయం ఐశ్వర్య తల్లిదండ్రులు ఆమె భర్త ఇంటికి చేరుకుని.. రాజీ చేసి.. ఐశ్వర్యను భర్త దగ్గరే ఉంచి తిరిగి ఊరెళ్లిపోయారు. ఆమె తల్లిదండ్రులు తమ ఊరికి కూడా చేరుకోక ముందే ఐశ్వర్య ఉరి వేసుకుని చనిపోయిందని వాళ్లకు ఐశ్వర్య భర్త ఫ్యామిలీ ఫోన్ చేసి చెప్పారు. కన్న కూతురి మరణ వార్తతో ఐశ్వర్య తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గుండెలవిసేలా రోదించారు. ఐశ్వర్యను ఆమె భర్త, అతని కుటుంబం చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఐశ్వర్య తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ లో ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై బాగల్గుంటే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
►ALSO READ | ఆన్ లైన్ బెట్టింగ్లో లక్ష రూపాలు లాస్.. పురుగుల మందు తాగి డిగ్రీ సెకండియర్ స్టూడెంట్ సూసైడ్
