పెళ్లిలో మిగిలిన భోజనం.. అభాగ్యులకు పంచిపెట్టిన మహిళ 

పెళ్లిలో మిగిలిన భోజనం.. అభాగ్యులకు పంచిపెట్టిన మహిళ 

రాణాఘాట్: మన దేశంలో పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేస్తారో తెలిసిందే. జీవితంలో ముఖ్యమైన తంతుగా భావించే పెళ్లిలో ఎంత డబ్బులు ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. తరతరాలు గుర్తుంచుకోవాలని రకరకాలు రుచులతో విందు భోజనాలు పెడతారు. అయితే పెద్ద మొత్తంలో ఆహార పదార్థాలు మిగిలిపోతుంటాయి. అవన్నీ వృథా అవుతున్నా.. పెళ్లి హడావుడిలో ఈ విషయాన్ని పట్టించుకునేంత తీరిక ఉండదు. కానీ బెంగాల్ కు చెందిన పాపియా కర్ అనే మహిళ మాత్రం వీటికి భిన్నం. తన సోదరుడి వివాహ విందులో మిగిలిన వంటల్ని అభాగ్యులకు పంచిపెట్టింది పాపియా. 

రిసెప్షన్ అనంతరం మిగిలిన భోజనాన్ని రాణాఘాట్ రైల్వే స్టేషన్ కు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వచ్చిన పాపియా.. ప్లాట్ ఫామ్ పై ఆకలితో అలమటిస్తున్న వారికి ఆహార పదార్థాలను స్వయంగా వడ్డించింది. ఈ దృష్యాలను నీలాంజన్ మండల్ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బందించి ఫేస్ బుక్ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్స్ గ్రూప్ లో షేర్ చేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాపియా కర్ కు నెటిజన్స్ నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈమె అందరికీ స్ఫూర్తి అని, ఇలాంటి మంచి పనులను కొనసాగించాలని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.