దేవరుప్పల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బీజేపీ కార్యకర్త

దేవరుప్పల దాడిలో తీవ్రంగా గాయపడ్డ బీజేపీ కార్యకర్త

జనగాం జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో నిన్న టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో బీజేపీ కార్యకర్త, సర్పంచ్  రావుల మల్లేష్ యాదవ్ తీవ్రంగా గాయపడ్డారు. జనగామ ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మల్లేష్  పరిస్థితి విషమంగా మారడంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.  విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మల్లేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వెంటనే  యశోద హాస్పిటల్ వైద్యులకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని  కోరారు. టీఆర్ఎస్ కార్యకర్తలు నిన్న పాదయాత్ర పై కంకర రాళ్లు విసరడంతో.. మల్లేశ్ యాదవ్ తల పగిలి, మెడ నరాలు చిట్లాయని బండి సంజయ్ తెలిపారు. యశోద ఆస్పత్రికి చేర్చిన మల్లేష్ ను ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్ ​శ్రేణులు సోమవారం దాడి చేశాయి. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో రాళ్లు, కట్టెలతో విరుచుకుపడ్డాయి. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతుండగా.. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు దాడులకు దిగారు. ఈ సమయంలో పోలీసు బందోబస్తు పెద్దగా లేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. రెండు గంటలకు పైగా ఉద్రిక్తత కొనసాగింది. పోలీసులు తక్కువగా ఉండడంతో ఒక వైపు కంట్రోల్ చేస్తే మరో వైపు దాడులకు పాల్పడ్డారు. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడగా.. చికిత్స కోసం జనగామ జిల్లా హాస్పిటల్‌‌కు తరలించారు. ఎట్టకేలకు పోలీసులు చెదరగొట్టడంతో సంజయ్ యాత్ర ముందుకు సాగింది. అయితే కొద్ది దూరం వెళ్లగానే మరోసారి టీఆర్ఎస్‌‌ లీడర్లు గొడవకు దిగారు. ఈ ఘటనలో బీజేపీ లీడర్లకు చెందిన రెండు కార్ల అద్దాలను గులాబీ శ్రేణులు ధ్వంసం చేశాయి.