ప్రజా సమస్యలపై బీజేపీ, కాంగ్రెస్​ ఆందోళన

ప్రజా సమస్యలపై బీజేపీ, కాంగ్రెస్​ ఆందోళన
  • 20 నిమిషాల్లోనే సమావేశాన్ని ముగించిన మేయర్​
  • కొనసాగించాల్సిందేనంటూ ప్రతిపక్షాల పట్టు.. 
  • ఐదు గంటలపాటు కౌన్సిల్​ హాల్​లో నిరసన
  • మేయర్​, ఆఫీసర్లు కుమ్మక్కయ్యారు: బీజేపీ
  • ఏదో ఒకటి చెప్పి వాయిదా వేస్తున్నరు: కాంగ్రెస్​
  • అధికారులు అట్ల చేయాల్సింది కాదు: ఎంఐఎం
  • బీజేపీ కార్పొరేటర్ల తీరే కారణం: మేయర్

హైదరాబాద్, వెలుగు: ఒకవైపు ప్రజా సమస్యలపై ప్రతిపక్ష కార్పొరేటర్ల ఆందోళనలు.. మరోవైపు తమ ఆఫీసుల ముందు చెత్త వేశారని అధికారుల బాయ్​కాట్​తో బుధవారం జీహెచ్​ఎంసీ కౌన్సిల్​ సమావేశం అట్టుడికింది. కేవలం 20 నిమిషాల్లోనే  సమావేశాన్ని మేయర్​ వాయిదా వేశారు. దీనిపై బీజేపీ, కాంగ్రెస్​ కార్పొరేటర్లు భగ్గుమన్నారు. దోమలు, కుక్కల బెడదతో, చెత్త సమస్యతో జనం నిత్యం తిప్పలు పడుతున్నా జీహెచ్​ఎంసీ స్పందించడం లేదని, ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాన్ని నిర్వహించాలంటూ ఐదు గంటల పాటు కౌన్సిల్​ హాల్​లోనే  ఆందోళనకు దిగారు. మేయర్, కమిషనర్​ ముందే ఆఫీసర్లు సమావేశాన్ని బహిష్కరించినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మేయర్​, అధికారులు కుమ్మక్కై సమావేశం జరగకుండా చూస్తున్నారని, ఏదో కారణం చెప్పి ప్రజా సమస్యలు చర్చకు రాకుండా వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. 

అధికారులపై బీజేపీ కార్పొరేటర్లు ఇష్టమున్నట్లుగా మాట్లాడుతున్నారని, అందుకే వారు సమావేశాన్ని బాయ్​కాట్​ చేశారని మేయర్​ అన్నారు. వాటర్​ బోర్డు ఎండీ రావాలంటూ పట్టు గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్ కార్పొరేషన్​(జీహెచ్​ఎంసీ) కౌన్సిల్​ సమావేశం బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు మొదలు కావాల్సి ఉండగా.. పన్నెండున్నర అవుతున్నా మేయర్​గద్వాల్​ విజయలక్ష్మి  రాకపోవడంతో త్వరగా రావాలని బీజేపీ కార్పొరేటర్లు సభలో నినాదాలు మొదలుపెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె కౌన్సిల్​ హాల్​కు వచ్చారు. సమావేశంలో ముందుగా.. ఇటీవల చనిపోయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, గుడిమల్కాపూర్ కార్పొరేటర్ దేవర కరుణాకర్, ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన సైనికులు, కలాసీగూడలోని నాలాలో పడి మరణించిన చిన్నారి మౌనికకు కౌన్సిల్ సంతాపాన్ని ప్రకటించింది.

సంతాప తీర్మానాన్ని మేయర్  విజయలక్ష్మి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఈ తీర్మానాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్, బీజీపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు మాట్లాడారు. అనంతరం మేయర్ ప్రసంగించారు. ఆ తర్వాత సభకు లంచ్ బ్రేక్ ఇస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అప్పటికే ఒంటి గంట కూడా కాకపోవడంతో కొద్దిసేపు సమావేశాన్ని నిర్వహించాలని సభ్యులు కోరారు. జలమండలి (వాటర్​ బోర్డు) ఎండీ దాన కిశోర్​ సమావేశానికి రావాలని బీజేపీ సభ్యులు మేయర్​ను కోరారు. జీహెచ్​ఎంసీలో డ్రైనేజీ, మంచినీటి సమస్యలతో జనం తిప్పలు పడుతున్నారని, ఎండీ వచ్చి వివరణ ఇవ్వాలని వారు పట్టుబట్టారు. దీంతో సమావేశంలో ఉన్న వాటర్ బోర్డు ఈడీ సత్యనారాయణ మాట్లాడేందుకు మేయర్​ అవకాశం కల్పించారు. 

చెత్త వేశారని అధికారుల బాయ్​కాట్​

కౌన్సిల్​ సమావేశంలో వాటర్ బోర్డు ఈడీ సత్యనారాయణ మాట్లాడుతూ.. మూసాపేట్ వాటర్​ బోర్డు  సెక్షన్ ఆఫీసు, వాటర్​ బోర్డు హెడ్​ ఆఫీసు ముందు మంగళవారం బీజేపీ కార్పొరేటర్లు చెత్త వేశారని, దీన్ని అసౌకర్యంగా ఫీల్ అవుతున్నామని, ఇందుకు నిరసనగా సమావేశాన్ని బాయ్​కాట్​ చేస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆయనతో పాటు అక్కడే ఉన్న ముగ్గురు వాటర్​ బోర్డు డైరెక్టర్లు కూడా సమావేశాన్ని బాయ్​కాట్​ చేశారు.  వాటర్​ బోర్డు అధికారులకు మద్దతుగా జీహెచ్ఎంసీ అధికారులు కూడా  సమావేశం నుంచి వాకౌట్​ చేసి వెళ్లిపోయారు. దీంతో మేయర్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కౌన్సిల్​ మీటింగ్​ను అధికారులే బహిష్కరించడంతో అక్కడున్న ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. నగరంలోనే జరిగిన పలు పరిణామాలపై 
ప్రశ్నిద్దామనుకుంటే ఇలా అధికారులు సమావేశాన్ని బహిష్కరించడం, సమావేశం వాయిదా పడటంపై మండిపడ్డారు. అధికార పక్షానికి, అధికారులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష కార్పొరేటర్లు నినాదాలు చేశారు. బీజేపీ కార్పొరేటర్లు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. అధికారులే మీటింగ్​ను  బాయ్​కాట్​ చేయడం అంటే అందరినీ అవమానపర్చడమేనని మండిపడ్డారు. మేయర్​, అధికారులు కుమ్మక్కై సమావేశం జరగకుండా చూస్తున్నారని వారు ఆరోపించారు. 

ఆ అధికారులకు షోకాజ్ నోటీసులు​ ఇవ్వాలి

లంచ్​ బ్రేక్​ తర్వాతనైనా సమావేశాన్ని నిర్వహించాలంటూ బీజేపీ, కాంగ్రెస్​ కార్పొరేటర్లు డిమాండ్​ చేశారు. కమిషనర్​ లోకేశ్​ కుమార్​ చాంబర్​కు వెళ్లి ఆయనను నిలదీశారు. ‘మీ సమక్షంలోనే అధికారులు సమావేశాన్ని బాయ్​కాట్​ చేసినా ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదు?” అని ప్రశ్నించారు. ఆ అధికారులకు షోకాజ్​ నోటీసులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అధికారులను అడిగి విషయం తెలుసుకుంటానని కమిషనర్​ చెప్పారు. చర్యలు తీసుకునేవరకు ఊరుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. మళ్లీ కౌన్సిల్​ను సమావేశ పర్చాలని, ప్రజా సమస్యలపై స్పందించాలని డిమాండ్​ చేశారు. సాయంత్రం 6 గంటల వరకు కౌన్సిల్ హాల్​లోనే బీజేపీ కార్పొరేటర్లు కూర్చున్నారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి బీజేపీ స్టేట్ ఆఫీసు వద్ద వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత  నెలకొంది. తోపులాటలో ఓ మహిళా కార్పొరేటర్​కు స్వల్ప గాయలయ్యాయి. 

నల్లని దుస్తుల్లో, దోమ గెటప్​లో 

గ్రేటర్​ హైదరాబాద్​లో అనేక సమస్యలు ఉన్నాయని, వాటి గురించి కౌన్సిల్​లో గట్టిగా నిలదీద్దామని ప్రతిపక్ష కార్పొరేటర్లు కౌన్సిల్​ మీటింగ్​కు వచ్చారు. ఈ మధ్య సిటీలో అనేక చోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. నాలుగు రోజుల కింద కలాసీగూడ వద్ద నాలాలో జారి పడి చిన్నారి మౌనిక చనిపోయింది. సిటీలో కురుస్తున్న అకాల వర్షాలకు డ్రైనేజీలు పొంగి కాలనీలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. దోమలు, కుక్కల బెడద పెరిగిపోయింది. ఈ అంశాలన్నింటిపైనా మాట్లాడాలని ప్రతిపక్ష కార్పొరేటర్లు నిర్ణయించుకున్నారు. కొందరు కార్పొరేటర్లు నల్ల దుస్తులతో సమావేశానికి వచ్చారు. దోమల బెదడను సూచించేలా ఒక కార్పొరేటర్​ దోమ గెటప్​లో వచ్చారు. మరో కార్పొరేటర్​ సిటీలో వరదలను ఉద్దేశిస్తూ స్విమ్మింగ్​ ట్యూబ్​ను తీసుకొని వచ్చారు. దోమల బెడద పెరిగిపోతున్నా కాలనీల్లో ఫాగింగ్​ చేయడం లేదని, పూడిక తీసిన చెత్త (సిల్ట్​)ను రోడ్లమీదనే వదిలేస్తున్నారని, చెడగొట్టు వానల వల్ల జనం ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 

ఇది చీకటి రోజు: మేయర్

అధికారులు సమావేశాన్ని బహిష్కరించిన అనంతరం మేయర్ విజయలక్ష్మి తన చాంబర్ లో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జీహెచ్ఎంసీలో  ఎన్నడూ లేని విధంగా అధికారులు సభను బహిష్కరించారు. ఇది చీకటి రోజు. అధికారులపై బీజీపీ కార్పొరేటర్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నరు. అందుకే అధికారులు సమావేశాన్ని బహిష్కరించారు. దీనివల్ల ప్రజల సమస్యలపై చర్చ జరగకుండానే సమావేశం వాయిదా పడింది” అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశామని, బీజీపీ కార్పొరేటర్లు ఉద్దేశపూర్వకంగా నిరసనకు దిగారని, నల్ల దుస్తులు ధరించి సమావేశానికి వచ్చారని తెలిపారు. జలమండలి ఆఫీసులో చెత్త వేయడం ఏమిటని ప్రశ్నించారు.