
దేశ వ్యాప్తంగా కల్తీ కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. కూరగాయలు, పండ్లు, హోటళ్లలో తినే ఆహారంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ వ్యాపారులు సొమ్ముచేసుకుంటున్న ఘటనలు రోజురోజుకు ఎక్కువవడం ఆందోళన కరంగా మారింది. దీంతో ఆలస్యంగా మేల్కొన్న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) భారత్ లో అమ్మే ఫోర్టిఫైడ్ బియ్యం, పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు వంటి ఇతర ఆహార పదార్థాల నిఘాపై ఫోకస్ పెట్టింది. బ్రాండెడ్ మసాలా దినుసులు,ఆహారా పధార్థాల తయారీ, నిల్వల శాంపిల్స్ ను మార్కెట్ నుంచి సేకరిస్తోంది. అవి FSSAI నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేదో తనిఖీ చేస్తుంది.
ఏప్రిల్ లో హాంకాంగ్ లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ (CFS) మద్రాస్ కర్రీ పౌడర్, ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా, MDH సాంభార్ మసాలా మిక్స్‌డ్ మసాలా పౌడర్ , MDH కర్రీ పౌడర్ మిక్స్‌డ్ మసాలా పౌడర్‌లను కొనుగోలు చేయవద్దని వినియోగదారులను కోరింది. అంతేగాకుండా వాటిని విక్రయించవద్దని వ్యాపారులను కోరిన సంగతి తెలిసిందే. రెండు ఇండియన్ బ్రాండ్ కు చెందిన ఫ్రీ ప్యాకేజ్డ్ మసాల శాంపిల్స్ లలో పురుగు మందు ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నట్లు కూడా సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ( సీఎఫ్ఎస్) తెలిపింది.
అలాగే సింగపూర్ అథారిటీ కూడా ఈ మసాలా దినుసులను రీకాల్ చేయాలని ఆదేశించింది. హాంకాంగ్ ఆదేశాలను అనుసరించి సింగపూర్ ఫుడ్ అథారిటీ కూడా ఇండియా నుంచి దిగుమతి చేసుకున్న ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మాసాలను రీకాల్ చేయాలని ఆదేశించింది. ఇటీవలే నెస్లే సెరెలాక్ లో అధిక స్థాయిలో చక్కెర ఉన్నట్లు రిపోర్టులు రావడంపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కల్తీని కట్టడి చేసేందుకు తనఖీలు చేస్తోంది.
ఈ క్రమంలోనే FSSAI అలర్ట్ తో టాస్క్ ఫోర్స్ టీంలు ఎక్కడిక్కడ తనిఖీలు చేస్తున్నాయి. రూల్స్ కు విరుద్ధంగా ఆహార నిల్వ, నూనెల పునర్వినియోగం, పరిశుభ్రత, నీటి నాణ్యత, తయారీకి విధానాలు వంటి అంశాలను ఆహార భద్రతాధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే వెంటనే నోటీసులను జారీ చేస్తున్నారు.అవసరమైతే కేసులు నమోదుచేస్తున్నారు.