బీజేపీ, యూపీఏ ప్రభుత్వాలు ITIR కు ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… ITIR ప్రాజెక్టును కొనసాగించలేమని మోడీ సర్కార్ తేల్చిచెప్పినా… నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా మా పని మేం చేసుకుంటూ పోతున్నామన్నారు. తెలంగాణ వచ్చిందే ఉద్యోగాల కోసం. కాబట్టి ఉద్యోగ కల్పన సృష్టిస్తున్నామని చెప్పారు. యువతకు కేసీఆర్ సర్కార్‌పై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మాని.. అభివృద్ధికి సహకరించాలన్నారు.
ఆఫీస్ స్పేస్ ఆక్యుపేషన్‌లో హైదరాబాద్ నగరం బెంగళూరును దాటిపోయిందన్నారు మంత్రి కేటీఆర్. అన్ని రంగాల్లో ముందుకు పోతున్నాం కాబట్టే 17 శాతం వృద్ధిరేటు సాధ్యమైందన్నారు. ఐటీ రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య ఐదున్నర లక్షలకు చేరిందని తెలిపారు. టీఆర్‌ఎస్ సర్కార్ సమర్థత వల్లే ఐటీ రంగంలో దిగ్గజాలైన కంపెనీలు ఫేస్‌బుక్, ఆపిల్, గూగుల్, అమెజాన్.. బెంగళూరును కాదని హైదరాబాద్‌కు వచ్చాయన్నారు. 12 లక్షల 67 వేల ఉద్యోగాలు టీఎస్‌ఐపాస్ ద్వారా సృష్టించామని తెలిపారు మంత్రి కేటీఆర్.


