భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా హరీష్ రావు ప్రతిరోజూ ఏదో ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజలను ఏకం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను చూసి హరీష్ రావు ఓర్వలేకపోతున్నారని చామల విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తన స్వార్థం కోసం తెలంగాణలో బీజేపీకి సహకరించిందని.. ఎనిమిది మంది బీజేపీ ఎంపీల గెలుపు వెనుక బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ ఉందన్నది బహిరంగ రహస్యమని ఆయన ధ్వజమెత్తారు.
హరీష్ రావు వాడిన హైబ్రిడ్, క్రాస్ బీడ్ పదజాలంపై స్పందిస్తూ.. అసలైన క్రాస్ బీడ్ విధానం హరీష్ రావుదేనని ఎద్దేవా చేశారు. తన మామ తర్వాత తానే ముఖ్యమంత్రి కావాలని హరీష్ రావు కలలు కన్నారని, అది సాధ్యం కాకపోవడంతోనే ఈ అసహనమని అన్నారు.
మహిళా బిల్లు పేరుతో బీజేపీ డీలిమిటేషన్ పాలిటిక్స్ చేస్తోందని, దీన్ని ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి అడ్డుకుంటాయని హెచ్చరించారు. అలాగే బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇచ్చారని గుర్తు చేశారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన తేజస్వి సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీలందరం సమర్థవంతంగా తిప్పికొట్టామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

