V6 News

పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్: స్పీడ్ పెంచింది బీజేపీ

పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్: స్పీడ్ పెంచింది బీజేపీ

పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్ గా స్పీడ్ పెంచింది బీజేపీ. దేశవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు అగ్ర నేతలు. సికింద్రాబాద్ సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి గడ్కరీ.. బీజేపీతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. ఓటమి భయంతోనే విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు మురళీధర్ రావు.

దేశంలో పేదరిక నిర్మూలన కోసం కొత్త పథకాలు తీసుకువచ్చామన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. రైతుల సంక్షేమానికి గతంలో ఎప్పుడు లేనంతగా నిధులు ఇచ్చామన్నారు. లోక్ సభ ఎన్నికల కార్యాచరణలో బాగంగా సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్ లో జరిగిన హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంటరీ నియోజకవర్గాల పార్టీ నేతల సమావేశంలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీకి కట్టుబడి ఉందన్నారు గడ్కరీ. ఇరిగేషన్ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇచ్చామన్నారు.

హైదరాబాద్ లో భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో సమీక్ష జరిపారు మురళీధర్ రావు. మోడీ నే ప్రధానిగా మళ్లీ రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఓటమి భయంతోనే విపక్షాలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నాయన్నారు.

ఇక సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాని మోడీ, అమిత్ షా డైరెక్షన్ లో దేశవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టబోతోంది కమలదళం. వచ్చె నెలలో పదికోట్ల కుటుంబాలను స్వయంగా కలవనుంది. ఈనెల రెండో వారంలో 12 వందల కేంద్రాల్లో దాదాపు కోటిమంది కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ లో  మోడీ మాట్లాడనున్నారు. మార్చి 2న దేశంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఒకే సమయంలో బైక్ ర్యాలీలు తీయనున్నారు. ప్రతి కార్యకర్త ఇంటిపై పార్టీ జెండా ఎగురవేసేలా కార్యాచరణకు సిద్ధమైంది బీజేపీ..

అంతకుముందు నాంపల్లి ఇందిరా ప్రియదర్శిన ఆడిటోరియంలో గడ్కరికి కృతజ్ఞత సభ నిర్వహించాయి ఈబీసీ సంఘాలు. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినందుకు కేంద్రమంత్రిని సన్మానించాయి. ఈబీసీ కోటా చరిత్రాత్మకమన్న గడ్కరీ.. పేదల కోసమే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.