సబ్బండ వర్గాలు కొట్లాడి తెచ్చిన్రు..అందరూ కలిస్తేనే తెలంగాణ సాకారం

సబ్బండ వర్గాలు కొట్లాడి తెచ్చిన్రు..అందరూ కలిస్తేనే తెలంగాణ సాకారం
  • ఉద్యమ ఆకాంక్షలు మాత్రం నెరవేరట్లే
  • వీ6 వెలుగు చర్చా కార్యక్రమంలో ఉద్యమ నాయకులు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రం పదో ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా వీ6 వెలుగు నిర్వహించిన చర్చా కార్యక్రమంలో అప్పటి ఉద్యమ నాయకులు పలువురు ఆనాటి తమ పోరాట అనుభవాలను యాది జేసుకున్నారు. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజేఏసీ)కి చైర్మన్‌‌గా ఉన్న ప్రొఫెసర్ కోదండరాంతోపాటు గాదె ఇన్నయ్య, హరగోపాల్, అప్పటి ఉద్యోగుల సంఘం నేత విఠల్, అప్పుడు ఎంపీలుగా ఉన్న పొన్నం ప్రభాకర్, సిరిసిల్ల రాజయ్య, వివేక్ వెంకటస్వామి, బలరాం నాయక్, సురేశ్​ షెట్కర్ తదితరులు చర్చలో పాల్గొన్నారు. 

అందరం కలిసే ఉద్యమించినం: కోదండరాం   

తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరిలోనూ చైతన్యం కనిపించింది. జేఏసీ ద్వారా అందరినీ సమన్వయం చేశాం. తిరుమలగిరిలో ఓ మీటింగ్‌‌లో పాల్గొన్న కళాకారుడు, భువనగిరిలో ఓ రిపోర్టర్ చెప్పిన మాటల్లో నుంచి సకల జనుల సమ్మె ఆలోచన చేసినం. అరబ్‌‌, అమెరికా ఉద్యమాల స్ఫూర్తితో మిలియన్ మార్చ్, సాగరహారం ప్లాన్ చేసినం. అందరూ కలవడం వల్లే ఉద్యమం సాధ్యమైంది తప్పితే, ఏ ఒక్కరి వల్లనో కాదు. కానీ, మీడియాను కంట్రోల్ చేసి, పోరాటమంతా తానే చేసినట్టు ఎక్స్‌‌పోజ్ చేసుకోవడంలో కేసీఆర్ సక్సెస్ అయిండు. ఇప్పుడు ప్రజాస్వామికంగా వ్యవహరించే ప్రభుత్వం లేదు. 

కాంగ్రెస్ చెప్పుకోలేకపోయింది: హరగోపాల్  

సింగరేణి, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. పార్లమెంట్‌‌లో అప్పటి ఎంపీలు ఎంత చేయగలరో, అంతకుమించి కష్టపడ్డారు. అయితే, తెలంగాణను మేమే ఇచ్చాం అని చెప్పుకోకుండా కాంగ్రెస్ అధిష్టానం అడ్డుకుంది. ఏపీలో పార్టీ నష్టపోతుందన్న భయంతో, చెప్పుకోవాల్సినంత చెప్పుకోలేదు. దీని వల్ల ఏపీలో పూర్తిగా, తెలంగాణలో పాక్షికంగా కాంగ్రెస్ నష్టపోయింది. 

అమరుల అడ్రస్ లు లేవంటున్నరు: గాదె ఇన్నయ్య   

1952 నుంచి 2014 వరకూ ఎంతో మంది పోరాడితే తెలంగాణ వచ్చింది. ఇవ్వాళ ప్రభుత్వం అమరువీరులను మర్చిపోయింది. సుమారు1,300 మంది బలిదానం చేసుకుంటే, 635 మంది అమరుల కుటుంబాలకే ప్రభుత్వం సాయం చేసింది. మిగిలిన వాళ్లకు చేయండి అని అడిగితే అమరవీరుల అడ్రస్‌‌లు దొరుకుతలేవు అని ఆఫీసర్లతో చెప్పిస్తున్నారు. ఇది సిగ్గుచేటు. 

కొట్లాడి సాధించుకున్నాం..

లోక్‌‌సభలో తెలంగాణ బిల్లును పెడితే సీమాంధ్ర ఎంపీలు అడ్డుకుంటారని, బిల్లు పాస్ చేయించడం కష్టం అవుతుందని అప్పటి స్పీకర్ మీరా కుమార్ ముందే చెప్పారని కాంగ్రెస్​ నేత పొన్నం ప్రభాకర్ అన్నారు. కానీ, అందరి సపోర్ట్‌‌తో కొట్లాడి బిల్లు పాస్ చేయించుకున్నామని చెప్పారు. సిరిసిల్ల రాజయ్య మాట్లాడుతూ, లోక్‌‌సభలో బిల్ పాస్ అయ్యాక చాలా ఆనందపడ్డామని చెప్పారు. రాజ్యసభలోకి పోయిన తర్వాత టెన్షన్ పెరిగిందన్నారు. బిల్ పాస్ అయ్యే వరకూ ఎంపీలు బయటకు పోనియకుండా, రాజ్యసభ గేట్ల దగ్గర కావలి కాసినామన్నారు. బలరాం నాయక్​ మాట్లాడుతూ, పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సోనియా గాంధీ వద్దకు వెళ్లి చెప్పామని, ఎలాగైనా తెలంగాణ ఇస్తా, మీరు ఇప్పుడే బయట చెప్పకండని ఆమె హామీ ఇచ్చారనన్నారు. అంజన్​కుమార్​ యాదవ్​ మాట్లాడుతూ, ప్రతి రోజూ ఒక్కటే గానం.. తెలంగాణం అని అన్నారు. పార్లమెంట్‌‌ పరిసరాల్లో తాము కనిపించగానే సిబ్బంది కూడా జై తెలంగాణ అనేవాళ్లని, ఎవరైనా పెద్ద నాయకుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే, తెల్లారే వాళ్ల ఇంటికి వెళ్లి తెలంగాణ అవసరాన్ని వివరించి ఒప్పించేవాళ్లమన్నారు. కాళ్లు పట్టుకుని బతిమిలాడే వాళ్లమని చెప్పారు. కేసీఆర్ మాత్రం ఎప్పుడూ పార్లమెంట్‌‌లోకి వచ్చి కొట్లాడింది లేదన్నారు. సురేశ్​ షెట్కర్​ మాట్లాడుతూ, తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌‌లో టీఆర్‌‌‌‌ఎస్‌‌ను మెర్జ్ చేస్తానని కేసీఆర్ చెప్పారని, కానీ, మాట తప్పిండని,ఆయనను నమ్మి తామందరం మోసపోయామని చెప్పారు. విఠల్​ మాట్లాడుతూ, ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి రాష్ట్రం కోసం కొట్లాడామని చెప్పారు. డిస్మిస్ చేస్తామని బెదిరించినా, వెనక్కి తగ్గకుండా పాలన స్తంభించేలా చేశామని పేర్కొన్నారు. ఎన్నో ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణలో ఇప్పుడు సబ్బండ వర్గాలు ఇబ్బంది పడుతున్నయని తెలిపారు. గుత్తా సుఖేందర్​ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్‌ ఎంపీలం ఆ నాడు పార్లమెంట్​లో అనేకమార్లు ఆందోళనలు చేశామని గుర్తుచేశారు. సోనియా గాంధీ హామీ మేరకు రాష్ట్రం వస్తుందనే నమ్మకంతో ఉద్యమించామని చెప్పారు. మంద జగన్నాథం మాట్లాడుతూ, తెలంగాణ కోసం పార్లమెంట్‌ సాక్షిగా ఉద్యమించినందుకు గర్వపడుతున్నామన్నారు. తెలంగాణ ప్రాంత ఎంపీలం ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.. పలు మార్లు పార్లమెంట్‌ను స్తంభింపజేశామని, పార్లమెంట్ సాక్షిగా పోరాడినందుకు ఇప్పటికీ గర్వపడుతున్నామని పేర్కొన్నారు. 

ఎంపీలందరం కలిసి పనిచేసినం: వివేక్ వెంకటస్వామి   

తెలంగాణ కోసం సబ్బండ వర్గాలు ఉద్యమంలో పాల్గొన్నాయి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదని ప్రజలు ఉద్యమాన్ని నెత్తికి ఎత్తుకున్నారు. పార్లమెంటులో కొట్లాడాలని మమ్మల్ని ప్రెజర్ చేశారు. ఇంట్లో మా నాన్న అదే చెప్పేవారు. ఆంధ్ర నుంచి ఇంతమంది అపోజ్ చేస్తుంటే, తెలంగాణ రావడం సాధ్యమా? అని నేను అడిగాను. ఈసారి ప్రజలలో చాలా ఉత్సాహం ఉంది. కొట్లాడితే సాధించుకోవచ్చని ఆయన ప్రోత్సహించారు. మాలో చాలా మంది అప్పుడు ఫస్ట్ టైమ్ ఎంపీలం.. మాలో మాకు రాజకీయాలు చాలా తక్కువ ఉండే.. అందుకే ఎంపీలందరం కలిసి పనిచేసినం. పార్లమెంట్ మెట్ల మీదే పడుకుని నిరాహార దీక్ష చేసినం. అప్పటి స్పీకర్ మీరాకుమార్, ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్‌‌ చాలా సపోర్ట్ చేశారు. జగన్ వెళ్లి అద్వానీ మీద ప్రెజర్ చేశారు. అయినా, సుష్మాస్వరజ్ వెనక్కి తగ్గలేదు. అదొక హిస్టారికల్ ఫైట్.. ఎంతో మంది పెద్దల వద్దకు వెళ్లి తెలంగాణ ఇవ్వాల్సిన అవసరాన్ని చెప్పి ఒప్పించాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.