కేబినెట్ భేటీ వాయిదా.. ఈసీ నుంచి రాని అనుమతి

కేబినెట్ భేటీ వాయిదా.. ఈసీ నుంచి రాని అనుమతి

హైదరాబాద్, వెలుగు:  ఎలక్షన్ కమిషన్ (ఈసీ) నుంచి అనుమతి రాకపోవడంతో శనివారం జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. శనివారం మధ్యాహ్నం కేబినేట్ సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అధికారులు ఈసీ అనుమతి కోరారు. అయితే శనివారం రాత్రి వరకు కూడా ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో సమావేశం వాయిదా పడింది. ఈసీ నుంచి ఏ క్షణమైనా అనుమతి వస్తుందని మంత్రులు, అధికారులు శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సెక్రటేరియెట్ లోనే వేచి ఉన్నారు. 

కానీ రాత్రి 7 గంటల వరకు కూడా ఈసీ నుంచి స్పందన లేకపోవడంతో సీఎం, మంత్రులు తిరిగి వెళ్లిపోయారు. కేబినెట్ మీటింగ్ లో రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, వానాకాలం పంటల ప్రణాళిక, జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ, రాష్ట్రం ఏర్పడి పదేండ్లు పూర్తి కావడంతో విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించాలని ఎజెండా సిద్ధం చేశారు. 

ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో రైతుల సంక్షేమం, అత్యవసరమైన ఇతర అంశాలపై చర్చించలేకపోయామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈసీ నుంచి ఎప్పుడు అనుమతి వస్తే అప్పుడే కేబినేట్ భేటీ నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 20లోగా అనుమతి రాకపోతే మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లి ఈసీని అనుమతి కోరుతామని తెలిపారు.