
- ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్‌ఎస్‌లో ఉండే పరిస్థితి లేదు
- పంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం
యాదాద్రి, వెలుగు : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాపాడుకోలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. తన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని కేసీఆర్.. మళ్లీ బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఎలా అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో శనివారం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో కొనసాగే పరిస్థితి లేదన్నారు.
గ్రామ పంచాయతీ సహా త్వరలో జరగబోయే అన్ని ఎన్నికలకు రెడీగా ఉన్నామని, బీజేపీ విజయం కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. మేధావులు, విద్యావంతులు బీజేపీకి మద్దతుగా ఉన్నారని, వారి మద్దతుతోనే ఎక్కువ సంఖ్యలో స్థానాలను గెలుచుకోబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలోనూ తమ విజయం అని చెప్పారు.
కేసీఆర్ కుటుంబపాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి కాంగ్రెస్‌కు లేదన్నారు. ముందు ముందు ఏ ఎన్నికలు జరిగినా ఫలితాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగానే వస్తాయన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ క్యాండిడేట్ ప్రేమేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, గంగిడి మనోహర్‌రెడ్డి, బూరనర్సయ్య గౌడ్, సంకినేని వెంకటేశ్వర్‌రావు, పాశం భాస్కర్, చందా మహేందర్ గుప్తా, రత్నపురం బలరాం, జనగామ నర్సింహాచారి పాల్గొన్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పవర్ కోసం పార్టీ మారుతరువరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల్లో అప్పులు చేసి రైతులకు రుణమాఫీ చేయాలని ప్లాన్ చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తరఫున శనివారం వరంగల్‌లో ప్రచారం చేశారు. హంటర్‌రోడ్డులోని గోపా బిల్డింగ్‌లతో మేధావులతో సమావేశమయ్యారు.
అనంతరం హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షతన డీకన్వెన్షన్ హాల్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పవర్ ఎక్కడుంటే అక్కడికే వెళ్తారన్నారు. బీఆర్‍ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరబోతున్నారని కాంగ్రెస్ నేతలే స్వయంగా చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు వదిలి గాడిద గుడ్డు పట్టుకుందని, రేవంత్‍రెడ్డి గాడిద గుడ్డు పట్టుకుని తిరుగుతున్నాడని ఎద్దేవా చేవారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, మార్తినేని ధర్మారావు, యెండల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.