జమ్ము బస్టాండ్ లో పేలుడు.. 18 మందికి గాయాలు

జమ్ము బస్టాండ్ లో పేలుడు.. 18 మందికి గాయాలు

జమ్ము బస్టాండ్ లో ఆగి ఉన్న బస్సులో గ్రెనేడ్ పేలింది. ఈ ఘటనలో దాదాపు 18 మందికి గాయాలయ్యాయి. వారిని స్థానిక బక్షీ నగర్ ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

పేలుడు జరిగిన తర్వాత పోలీసులకు అక్కడున్న వారు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్, ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

సంఘటనా స్థలాన్ని జమ్ము కశ్మీర్ పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. దీన్ని ఉగ్రవాద చర్యగా భావిస్తున్నారు. ఈ పేలుడు గ్రెనేడ్ కారణంగా జరిగిందని, 18 మందికి గాయాలయ్యాయని జమ్ము ఐజీ ఎంకే మిశ్రా తెలిపారు. అయితే దీని వెనుక మోటో ఎంటీ, ఎవరు చేశారన్న విషయాలపై దర్యాప్తు జరుగుతోందన్నారు.

‘భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. మొదట బస్సు టైరు పేలిందని అనుకున్నాను. నెమ్మదిగా తేరుకుని చూస్తే బస్సు లోపలే పేలుడు జరిగింది. వెంటనే గాయపడిన వారిని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు’ అని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.

పుల్వామా దాడి తర్వాత జమ్ము బస్టాండ్ లో ఇలాంటి ఘటన జరగడంతో స్థానికుల్లో కలకలం రేగింది. పుల్వామా దాడి కూడా జమ్ము కశ్మీర్ కు చెందిన యువకుడు ఆదిల్ జైషే ఉగ్రవాదులతో కలిసి చేశాడు. తాజాగా జరిగిన గ్రెనేడ్ పేలుడు వెనుక కూడా స్థానిక ఉగ్రవాదులే ఉండే అవకాశం ఉందని, వారిలో ఆదిల్ తో సంబంధాలు ఉన్నవారే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపడుతున్నారు.