V6, వెలుగుపై  కవిత అక్కసు.. చూడొద్దని, చదవొద్దని కార్యకర్తలకు ఆదేశాలు

V6, వెలుగుపై  కవిత అక్కసు.. చూడొద్దని, చదవొద్దని  కార్యకర్తలకు ఆదేశాలు
  •     చూడొద్దని, చదవొద్దని బీఆర్​ఎస్​ కార్యకర్తలకు ఆదేశాలు
  •     యాడ్స్​, బైట్స్​ ఇవ్వొద్దని నేతలకు హెచ్చరికలు
  •     ఉద్యమ టైమ్​లో కిరణ్​ కుమార్​రెడ్డి.. ఇప్పుడు కవిత, కేటీఆర్ సేమ్​ టు సేమ్​​
  •     ప్రజా సమస్యలను చూపిస్తున్నందుకు అణచివేతలు, బాయ్​కాట్లు

నిజామాబాద్, వెలుగు: జనం సమస్యలపై ఎప్పటికప్పుడు వార్తలు అందిస్తున్న వీ6 చానల్​, వెలుగు పత్రికపై ఎమ్మెల్సీ కవిత మరోసారి అక్కసు వెళ్లగక్కారు. చానల్​, పత్రికను అఫీషియల్​గా బ్యాన్​ చేశామని, టాప్​ టు బాటమ్  వరకు పార్టీ కార్యకర్తలు ఈ విషయాన్ని గమనించి దూరంగా ఉండాలని ఆమె ఆదేశించారు. ప్రజలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయని ఆరోపించారు. వాటికి యాడ్స్​ కానీ, బైట్స్​గానీ ఇవ్వొద్దని హెచ్చరించారు. లైన్​ గీసుకొని వ్యతిరేకంగా కొట్లాడాలని అన్నారు. బుధవారం నిజామాబాద్​లో జరిగిన బీఆర్​ఎస్​ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కవిత మాట్లాడారు. బీఆర్​ఎస్​కు  వీ6 చానల్​, వెలుగు పత్రిక శత్రువులని, వీ6ను చూడొద్దని, వెలుగును చదవద్దని కార్యకర్తలకు చెప్పారు. వెలుగుకు లీడర్లు యాడ్స్​ ఎందుకు ఇస్తున్నారని ఆమె ప్రశ్నించారు. 

వాడు వీడు అంటూ కామెంట్లు చేశారు.  ‘‘మన పార్టీకి ఒక పేపర్​ ఉన్నది.. నమస్తే తెలంగాణ. మన పార్టీకి ఒక చానల్​ ఉన్నది.. టీ న్యూస్​. ఈ టీ న్యూస్​ చానల్​ను మనందరం యూ ట్యూబ్​లకు పోయి సబ్​ స్క్రైబ్​ చేసుకోవాలి. మనం టీ న్యూస్​ బంద్​ పెట్టి.. గా వీ 6 చూసినమనుకోండి.. ఏ ముంటది? అన్నీ అబద్ధాలే. ఇంకో పేపర్​ ఉన్నది.. వెలుగు అని. పేరుకే వెలుగు.. చీకటి ఉంటది మొత్తం.. ఏ ఉండదు. మన ఖర్మ ఏందంటే.. ఎందుకు భయపడ్తరో మరి మన నాయకులు.. వెలుగు పేపర్​కు అడ్వర్టయిజ్​మెంట్లు ఇస్తున్నరు. గట్లిస్తరా?  మన గురించి తప్పుగా రాసెటోనికి ఎవడైనా అడ్వర్టయిజ్​మెంట్లు ఇస్తరా? ఔసురమా మనకు. మీరొక సారి గట్టిగా లైన్​ తీసుకొని కొట్లాడాలె గంతే. వాడు మనకు వ్యతిరేకంగా రాస్తున్నడు.. ప్రజలకు వ్యతిరేకంగా రాస్తున్నడు అంటే ఖచ్చితంగా వాళ్లను బాయ్​కాట్ చేయాలె” అని కవిత అన్నారు. రానున్న ఎన్నికల దృష్ట్యా డివిజన్​ల వారీగా సోషల్​ మీడియాను యాక్టివ్​ చేయాలన్నారు. సోషల్​ మీడియా సెల్​లు ఏర్పాటు చేసుకొని గవర్నమెంటుకు అనుకూల పోస్టులు పెట్టాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్​ పార్టీలు చేస్తోంది ఇదేనన్నారు.
జిల్లాలో ఐదు చోట్లా సిట్టింగులే..
నిజామాబాద్​ జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలలో సిట్టింగ్​ ఎమ్మెల్యేలే పోటీ చేసి మరోసారి ఢంకా బజాయిస్తారని కవిత అన్నారు. ఏ పనిచేసినా వినాయకుడి పూజతో మొదలుపెడతామని, ఆ రీతిలో గణేష్​గుప్తాను వచ్చే ఎన్నికల్లో మొదటివాడిని చేయాలని చెప్పారు. తరువాత ప్రశాంత్​రెడ్డి, జీవన్​రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్​, షకీల్​ పేర్లు ప్రస్తావించారు. ఏ పార్టీ వారైనా చివరకు ఎవరెస్ట్​ శిఖరం లాంటి కేసీఆర్​ నాయకత్వంలోని గులాబీ నీడకు రావల్సిందేనని అన్నారు. ఇతర పార్టీల వారు బీఆర్​ఎస్​లోకి వస్తే అమ్ముడుపోయారని అపోజిషన్​ పార్టీల లీడర్లు  దుష్ప్రచారం చేస్తున్నారని, పార్టీలో చేరేవాళ్లు గొర్రెలు, మేకలుకారన్నారు.

బ్యాన్​ చేసినా.. వీ6, వెలుగు ఎప్పటికీ ప్రజల పక్షమే

ఈ మధ్య కవిత ఎక్కువగా వీ6, వెలుగునే కలువరిస్తున్నారు. మొన్నామధ్య ఢిల్లీలో కూడా ఇట్లనే అన్నారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని చూపించినందుకు వీ6పై అప్పటి సీఎం కిరణ్​కుమార్​రెడ్డి ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు జనం సమస్యలను వీ6 చూపెడ్తున్నదని, వెలుగు రాస్తున్నదని అధికార పార్టీ బీఆర్​ఎసోళ్లు కక్షగట్టారు. ఆంక్షలు పెడ్తున్నారు. ఉద్యమ టైమ్​లో సమైక్య పాలకుల తీరుకు, ఇప్పటి పాలకుల తీరుకు పెద్దగా ఫరక్​ లేదు. జనం సమస్యలను రాస్తుంటే.. జనానికి వ్యతిరేకంగా రాస్తున్నారని కవిత అనడం ఏమిటో ఆమెకే తెలియాలి. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తలేరని, రైతుల లోన్లు మాఫీ చేస్తలేరని, పోడు పట్టాలు పంచుతలేరని, దళితులకు మూడెకరాలు ఇవ్వడం ఆపేశారని, పేపర్లు లీకైతే పట్టించుకుంటలేరని, వడ్లు కొనాలని ధర్నాలు చేస్తున్నరని, కోట్ల శ్రీమంతులకు అగ్గువకే భూములు ఇస్తున్నరని, ఉద్యమకారులను యాదిమరిచారని, తెలంగాణ అమరులను తలుచుకుంటలేరని.. ఇట్ల జనం గోసను ఎప్పటికప్పుడు  వీ6 చూపెడ్తుంటే, , వెలుగు రాస్తుంటే.. జనానికి ఎట్ల వ్యతిరేకం?! బ్యాన్​ చేసినం బ్యాన్​ చేసినం అని కవితనే కాదు.. మంత్రి కేటీఆర్​ కూడా మూడునెలల కింద అక్కసు వెళ్లగక్కారు. అయినా.. జనం తరఫున వీ6 వార్తలు చూపెడ్తనే ఉన్నది, వెలుగు రాస్తనే ఉన్నది. ఎన్ని ఆంక్షలు పెట్టినా.. తెలంగాణే వీ6 – వెలుగుకు బలం, తెలంగాణ జనమే బలగం.