సెస్ కు బిల్లుల భారం

 సెస్ కు బిల్లుల భారం

విద్యుత్ ​శాఖకు బిల్లుల బకాయిలతో షాక్ కొడుతోంది. విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తున్న సిరిసిల్ల సహకార విద్యుత్ సంస్థ(సెస్) కు బకాయిలు భారంగా మారాయి. గ్రామ పంచాయతీలు, ఇరిగేషన్ సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థల బకాయిలు రూ. కోట్లకు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మంచినీటి బావులు, బోర్లు, స్ట్రీట్ లైట్స్, గ్రామ పంచాయతీలు, మున్సిపల్, ఇతర ప్రభుత్వ ఆఫీస్​లకు సంబంధించిన విద్యుత్ బకాయిలు కోట్లల్లో పేరుకుపోవడంతో సెస్ ఆఫీసర్లు చర్యలకు సిద్ధమయ్యారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాలు విద్యుత్ బకాయిల లిస్ట్ లో ఉన్నాయి. ప్రజలకు తాగునీరు అందించేందుకు బావులు, బోర్లకు, విద్యుత్ స్తంభాలకు, ఇతర అవసరాలకు మున్సిపల్, గ్రామ పంచాయతీ ఆఫీసర్లు విద్యుత్ వినియోగిస్తున్నారు. కొన్నేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల పరిధిలో కేవలం మున్సిపల్ ఆఫీస్​లు, గ్రామ పంచాయితీల బిల్లులు  మొత్తం రూ.130  కోట్లకు పైగా ఉంది. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ బకాయిల లిస్ట్ లో ఉందంటే విద్యుత్ బిల్లుల చెల్లింపు తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో మంచి నీటి సరఫరాకు, స్ట్రీట్ లైట్లకు కలిపి ప్రతి నెలా రూ.  2.12 కోట్ల బిల్లు వస్తున్నట్లు సమాచారం. గత ఏడేళ్లుగా సెస్ కు జిల్లాలోని మున్సిపల్, గ్రామ పంచాయతీలు బిల్లులు చెల్లించడం లేదని సమాచారం. సెస్ ఆఫీసర్లు ఎన్నోసార్లు విద్యుత్ బకాయిల విషయం ప్రభుత్వ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. చివరగా 2012  డిసెంబర్ లో సుమారు రూ. 6  కోట్లు మాత్రమే చెల్లించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నిసార్లు బకాయిలు చెల్లించాలని కోరినా స్పందన కరవైందని సెస్ ఆఫీసర్లు వాపోతున్నారు. ఇటీవలే 14 వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో జిల్లాలోని గ్రామ పంచాయితీలు విద్యుత్తు బిల్లుల బకాయి చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని గ్రామ పంచాయతీల విద్యుత్ బకాయిల లిస్ట్ ను జిల్లా పంచాయతీ ఆఫీసర్లకు పంపించారు.