లగేజ్​ సర్దుతూ పడుకుంటే.. అబుదాబి తీసుకెళ్లిన ఫ్లైట్

లగేజ్​ సర్దుతూ పడుకుంటే.. అబుదాబి తీసుకెళ్లిన ఫ్లైట్

న్యూఢిల్లీ: ముంబై నుంచి అబుదాబికి వెళ్లేందుకు ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లో ఫ్లైట్‌‌ రెడీగా ఉంది. ప్యాసెంజర్లు అందరూ ఒక్కొక్కరిగా ఎక్కుతున్రు. అంతకంటే ముందు ప్రయాణికుల లగేజీని అక్కడున్న లోడర్లు ఫ్లైట్‌‌ కార్గో కంపార్ట్‌‌మెంట్‌‌లో పెడుతున్రు. లగేజీ మోసి మోసి అలిసిపోయిండో ఎమో.. అందులో ఓ లోడర్‌‌‌‌ ఫ్లైట్‌‌ కార్గో కంపార్ట్‌‌మెంట్‌‌లోనే పడుకున్నడు. ఇంకేముంది.. లేచి చూసేసరికి ఫ్లైట్‌‌ అబుదాబిలో ఉంది. కార్గో కంపార్ట్‌‌మెంట్​లో ఉన్న అతడిని చూసి అధికారులు షాక్​ అయ్యారు. ఈ ఘటన ఇండిగో ఫ్లైట్‌‌లో జరిగింది. డైరెక్టరేట్‌‌ జనరల్‌‌ ఆఫ్‌‌ సివిల్‌‌ ఏవియేషన్‌‌ (డీజీసీఏ) అధికారులు మంగళవారం ఈ విషయం వెల్లడించారు.

ఆదివారం ముంబై నుంచి యూఏఈకు వెళ్తున్న ఇండిగో ఫ్లైట్‌‌లో ఓ ప్రైవేటు ఏజెన్సీకి చెందిన కొంతమంది లోడర్లు‌‌ కార్గో కంపార్ట్‌‌మెంట్‌‌లో లగేజీ సర్దుతున్నారు. అందులో ఒకతను లగేజీని సర్ది అందులోనే నిద్రపోయాడు. ఇది గమనించని సిబ్బంది కార్గో కంపార్ట్‌‌మెంట్‌‌ డోర్‌‌‌‌ క్లోజ్‌‌ చేశారు. తర్వాత ఫ్లైట్‌‌ ముంబైలో టేకాఫ్‌‌ కాగానే లోడర్‌‌‌‌ మేల్కొన్నట్లు అధికారులు తెలిపారు. ఇగ చేసేదేమీ లేక అందులోనే ఉండిపోయాడని చెప్పారు. అబుదాబిలో ఫ్లైట్‌‌ ల్యాండ్‌‌ అయ్యాక అక్కడి అధికారులు అతనికి వైద్య పరీక్షలు చేశారు. తర్వాత అతన్ని తిరిగి అదే ఫ్లైట్‌‌లో ప్యాసెంజర్‌‌‌‌గా ముంబైకి పంపినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు.