జగన్ పిటిషన్లు కొట్టేసిన్రు

జగన్ పిటిషన్లు కొట్టేసిన్రు

హైదరాబాద్, వెలుగు: సీబీఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్​ జగన్​కు చుక్కెదురైంది. ఆస్తుల కేసులో తనపై దాఖలైన 11 చార్జ్ షీట్లలోని ఐదు చార్జ్​షీట్లను  కలిపి ఒకేసారి విచారించాలన్న ఆయన పిటిషన్​ను శుక్రవారం సీబీఐ స్పెషల్ ప్రిన్సిపల్  జడ్జి బి.ఆర్ మధుసూధన్ రావు కొట్టివేశారు. దీంతోపాటు సీబీఐ కేసుల విచారణ పూర్తయ్యేంత వరకు ఈడీ కేసులో ట్రయల్స్ ప్రారంభించవద్దంటూ దాఖలు చేసిన మరో పిటిషన్​ను కూడా డిస్మిస్ చేశారు. ఐదు చార్జ్​షీట్లను కలిపి ఒకేసారి విచారించలేమని తెలిపారు. కోర్టు ఆదేశాలతో గత వారం సీబీఐ కోర్టులో హాజరైన జగన్​.. శుక్రవారం విచారణకు హాజరుకాలేదు. ఏపీ సీఎం హోదాలో ఉన్న తనకు ప్రభుత్వ కార్యకలాపాలు ఉన్నందున  విచారణకు రాలేకపోతున్నట్లు లాయర్​ ద్వారా ఆబ్సెన్స్​ పిటిషన్​ వేశారు. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది.

సీబీఐ కోర్టుకు మంత్రి సబిత

ఏపీ సీఎం జగన్  ఆస్తులు–పెన్నా సిమెంట్​ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో విచారణకు హాజరయ్యారు. టీఆర్ఎస్ నుంచి మంత్రి పదవి పొందిన తర్వాత మొదటిసారి సీబీఐ కోర్టులో విచారణకు వచ్చారు. కుమారుడు కార్తీక్ రెడ్డితో కలిసి ఉదయం 10 గంటలకు  నాంపల్లి గగన్ విహార్ లోని  కోర్టుకు చేరుకున్న ఆమె.. సుమారు రెండున్నర గంటలపాటు కోర్టు హాల్ లోనే కూర్చున్నారు. ఆ తర్వాత సీబీఐ స్పెషల్ ప్రిన్సిపల్ జడ్జి ముందు హాజరయ్యారు. మంత్రి సబితాతో పాటు ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పెన్నా సిమెంట్ అధినేత పెన్నా ప్రతాప్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఐఏఎస్ ఆఫీసర్​ శ్రీలక్ష్మీ, గనుల శాఖ మాజీ ఎండీ రాజగోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్, డీఆర్వో సుదర్శన్​ రెడ్డి, తహశీల్దార్ ఎల్లమ్మ కూడా కోర్టుకు హాజరయ్యారు. నిందితుల తరుపున సీనియర్  అడ్వకేట్​ ఉమామహేశ్వర రావు వాదనలు వినింపించారు. ఈ కేసులో జరిగే తదుపరి విచారణలకు తమ క్లయింట్స్ సహకరిస్తారని కోర్టుకు విన్నవించారు. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా పడింది.