ఎలక్షన్లు సజావుగా జరగాలంటే.. పోలీసు భద్రతే కీలకం

ఎలక్షన్లు సజావుగా జరగాలంటే.. పోలీసు భద్రతే కీలకం
  • నగదు, మద్యం పంపిణీపై నిఘా కోసం ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలి
  • పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో సీఈఓ వికాస్​రాజ్​

హైదరాబాద్​, వెలుగు: రానున్న అసెంబ్లీ  ఎన్నికల భద్రతపై సీఈఓ వికాస్​రాజ్ ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిపేందుకు  కీలకమైన భద్రతా మాడ్యూళ్లపై అవగాహన కల్పించారు. టెక్నాలజీ పెరిగినందున దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పోలీసు ఆఫీసర్లు చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో భద్రతకోసం పోలీసు అధికారులు కొత్త వ్యూహాలు అనుసరించాలన్నారు. ఈ సందర్భంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ..  ఎన్నికల్లో  నగదు, మద్యం అక్రమ రవాణా కోసం అనుమానిత వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు.  పోలింగ్ స్టేషన్ల నిర్వహణ, భద్రత సంబంధిత అంశాలపై పలు సూచనలు చేశారు.  ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు  పారదర్శకత పాటించాలన్నారు. ఇప్పటికే ఈసీ ఆదేశాలకు అనుగుణంగా దాదాపు 700 మంది పోలీసు సిబ్బందిని మార్చినట్లు చెప్పారు. చత్తీస్‌‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో దాదాపు 8,0-85 చెక్‌‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 

సీసీ కెమెరాలతో ఈ చెక్ పాయింట్లును బలోపేతం చేస్తామన్నారు.  పశ్చిమ బెంగాల్‌‌  సీఈఓ ఆరిజ్ అఫ్తాబ్ ఎన్నికల సన్నాహక పనులపై ప్రజేంటెషన్ ఇచ్చారు. పోలింగ్ బూత్‌‌ల వర్గీకరణ, అసెస్‌‌మెంట్‌‌ల గురించి ఆయన చర్చించారు.  పోలీసు అధికారులకు సెంట్రల్ ఆర్మ్‌‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), ఇండక్షన్, డిప్లాయ్​మెంట్,  డి- ఇండక్షన్ గురించి తమిళనాడు సీఈఓ తిరు సత్యబ్రత సాహూ అవగాహన కల్పించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ), వ్యయ పర్యవేక్షణకు సంబంధించిన అంశాలపై దృష్టి సారించే విధంగా  సెషన్  నిర్వహించారు.  ఈ  సమావేశంలో అడిషనల్​ డీజీ సంజయ్ కుమార్ జైన్, మహేశ్​ భగత్,  హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్,  సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్,  అడిషనల్​ సీఈఓ లోకేశ్​కుమార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్​ అహ్మద్, మొత్తం 33 జిల్లాల పోలీసు ఎస్పీలు, అదనపు ఎస్పీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.