సాయంత్రం 6 దాకా ఓటేయొచ్చు

సాయంత్రం 6 దాకా ఓటేయొచ్చు
  • గంట టైమ్​ పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
  • ఎండ తీవ్రత, వడగాలుల కారణంగానే టైమింగ్​లో మార్పు
  • రాజకీయ పార్టీల విజ్ఞప్తిపై సీఈసీ సానుకూల స్పందన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోలింగ్ టైమ్​ను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) గంటపాటు పొడిగించింది. ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 దాకా పోలింగ్ నిర్వహించనున్నట్టు బుధవారం ప్రకటించింది. ఎండ తీవ్రత, వడగాలుల కారణంగా పోలింగ్ టైమ్​ను గంట పాటు పెంచాలని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల అధికారులను కోరారు. ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని తెలిపారు. 17 లోక్​సభ స్థానాల్లో సాయంత్రం 6 దాకా పోలింగ్​కు అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్​కు విజ్ఞప్తి చేశారు.

దీనిపై స్పందించిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్.. ఎండ తీవ్రత, వడగాలుల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5  వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ టైమ్ ముగియగానే.. అప్పటికే క్యూ లైన్​లో నిల్చున్న వారిని మాత్రమే ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఇక నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు. ప్రస్తుతం ఎండలు దంచికొడ్తున్నందున పోలింగ్ టైమ్​ను గంట సేపు పొడిగించారు.