సింహరాశి
ఆదాయం : 05
వ్యయం : 05
రాజపూజ్యం: 06
అవమానం : 06
మఘ 1,2,3,4 పాదములు
పుబ్బ 1,2,3,4 పాదములు
ఉత్తర 1వ పాదముల యందు
"మా, మీ, మూ, మే. మో, టా, టీ, టూ,టే" అను అక్షరములు తమపేరునకు మొదట గలవారు సింహరాశికి చెందినవారు.
2026 - 2027 సంవత్సర ఫలితాలు: సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి శుభగ్రహమైనటువంటి గురువు జూన్ రెండవ తేదీ వరకు అత్యంత అనుకూలమైనటువంటి స్థానం అనగా లాభ స్థానంలో ఉండటం వలన అదృష్ట సమయంగా చెప్పవచ్చు. అన్నిరకాలుగా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.
ఊహించని ధన లాభం కలుగుతుంది. మీరు ఎప్పుడో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు రావడం ప్రారంభమవుతుంది. ఉద్యోగపరంగా పదోన్నతి ప్రమోషన్స్ లభిస్తాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది..
కాంట్రాక్టులు, లీజులు రెన్యువల్స్ లభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి రాహువు ఏడవ ఇంటిలో ఉండటం అనేది అనుకూలమైనది కాదు. మరియు ఈ రాశి వారికి అష్టమ శని ప్రభావం కూడా ఉంటుంది. అష్టమ శని. నడుస్తుంది అంటే అన్ని అనుకూలంగా ఉండవని కాదు కానీ ఆచితూచి వ్యవహరించాలి.
అనుకూలమైన గురు గ్రహ ప్రభావం వలన ఎలాంటి సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. ఎప్పుడైతే గురువు లాభ స్థానం నుండి వ్యయ స్థానంలోకి అడుగుపెడతారో అనగా జూన్ రెండవ తేదీ నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ సమయంలో రాహు కేతువులు మరియు గురు, శని గ్రహాలు కూడా అనుకూలంగా లేవు.
ఈ మధ్య సమయం సింహరాశి వారికి కష్టతరమైన సమయంగా చెప్పవచ్చు. ఖర్చులుఎక్కువవుతాయి. ఈ ఖర్చులలో కూడా ఎక్కువగా ఆరోగ్యానికి సంబంధించినవై ఉంటాయి. ఈ అష్టమ శని యొక్క ప్రభావం సంవత్సర ప్రథమార్ధంలో అంతగా మీకు కనిపించదు కానీ ద్వితీయార్థంలో చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
వ్యాపార పరంగా నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సంవత్సర ద్వితీయార్థంలో గురువు 12 వ స్థానంలో ఉంటారు కాబట్టి ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయాలి. ఉద్యోగ పరంగా కానీ ఇతర కారణాల వల్ల కానీ కుటుంబ సభ్యులకు దూరంగా కాలం గడపవలసిన పరిస్థితి రావచ్చు. విదేశాలకు వెళ్లడానికి మాత్రం అవకాశాలు కలిసి వస్తాయి.
విదేశాలలో ఉన్నవారికి పీఆర్, గ్రీన్ కార్డు, హెచ్ 1బి వీసా లభిస్తుంది. రాహువు 7వ ఇంటిలో ఉండటం వలనఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. భార్యా భర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది.
రాహువు కళత్ర స్థానంలో అంటే వివాహ స్థానంలో ఉన్నారు కాబట్టి వివాహ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంవత్సర ద్వితీయార్ధం వరకు కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పదగిన సూచన.
ALSO READ : కర్కాటకరాశి : ఖర్చులు పెరిగినా డోంట్ వర్రీ.. గ్రహాలు బాగా అనుకూలిస్తాయి..
అక్టోబర్ 31వ తేదీన గురువు జన్మరాశిలోకి వస్తారో అప్పుడు సంతాన సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు సూర్యాష్టకం పఠించడం, శని గ్రహ స్తోత్రం చదవడం చెప్పదగిన సూచన. వీలైతే హనుమాన్ చాలీసా చదవండి. వృత్తి వ్యాపారాలలో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది.
ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ ఉండే పరిస్థితి గోచరిస్తుంది. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తల పెట్టినా మీ కృషి, పట్టుదలతో సఫలం అవుతుంది. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థాయికి చేరుకుంటారు.
నూతన వ్యాపార ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. క్రీడారంగంలో, సాహిత్య, విద్యారంగంలో మీ అంచనాలు ఫలిస్తాయి. చార్టెడ్ అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి, లాయర్లకు, పోలీస్ శాఖలో ఉన్నవారికి, యోగా మెడిటేషన్ సెంటర్స్, పౌల్ట్రీరంగంలో ఉన్నవారికి, హోటల్ మేనేజ్ మెంట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, చిన చిన్న వ్యాపారస్థులకు, హాస్టల్స్ నడిపేవారికి, బంగారం పనివారికి, కార్పెంటర్స్కు , బొటికి, న్యూరాలజీ, డెంటిస్ట్, ఈఎన్టీ, గైనకాలజిస్టులకు, డర్మటాలజిస్టులకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు.
రాజకీయరంగంలో ఉన్నవారికి ప్రత్యర్థుల వల్ల మానసికంగా కృంగిపోవడం, నమ్మినవాళ్ళు మోసం చేశారనే బాధ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దైవానుగ్రహం వల్ల ఒక పదవి మిమ్మల్ని వరించడం జరుగుతుంది. విద్యార్థినీ విద్యార్థులకు సువర్ణకాలంగా చెప్పవచ్చు.
ముఖ్యంగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే. వారికి కాలం కలిసివస్తుంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడితే తప్ప, శ్రద్ధ పెంచితే తప్ప ఆశించిన ఫలితాలు సాధించకపోవచ్చు. హెచ్ 1బి, గ్రీన్ కార్డు, పి.ఆర్.లకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. స్నేహితులను నమ్మి మోసపోవద్దు. ఎవరు మనవారో, ఎవరు కాదో పరిశీలించుకుని ముందుకు వెళ్ళాలి. ప్రతి విషయంలో కూడా గోప్యత వహించడం అనేది చెప్పదగినది.
ఎం.బి.ఎ.. వైద్య విద్య, సి.ఎ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ రంగాల వారికి మంచి అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. అలాగే విదేశాలలో ఉద్యోగం చేస్తున్న వారికి ఆకస్మిక స్థానచలనం కలిగే అవకాశం ఉంది.
స్త్రీలకు ప్రత్యేకం : ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగంలో కొన్ని మార్పులు వస్తాయి.. భార్యాభర్తల మధ్య ఎక్కువ తక్కువ అనే విభేదాలు వస్తాయి. వివాహ సంబంధమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. చదివిన చదువుకు, చేస్తున్న ఉద్యోగానికి తేడా ఉంటుంది. పట్టుదలతో మీరు కోరుకున్న ఉద్యోగం సంపాదించడానికి చాలా కష్టపడతారు.
మీ పేరుమీద స్థిరాస్తులు పెరుగుతాయి. గృహనిర్మాణ వస్తువులు కొనుగోలు చేస్తారు. స్వంత ఇంటి కల నెరవేరుతుంది. మీ శ్రమకు తగిన ఫలితాన్ని పొందగలుగుతారు. అయినవారితో, ఆప్తులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అధికారుల వేధింపులు ఎక్కువ అవుతాయి.అయితే దైవానుగ్రహం వల్ల కొన్ని సమస్యల నుండి బయటపడతారు.
వ్యాపారపరంగా అనేక అవకాశాలు కలిసి వస్తాయి. మీకు సంవత్సర ప్రథమార్ధం, ద్వితీయార్థం రెండూ బాగున్నాయి. మధ్యలో మూడు నెలలు ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పటికీ సహనం, ఓర్పుతో అన్ని సమస్యల నుండి బయటపడగలుగుతారు. సంతానం కోసంప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ప్రెగ్నెన్సి సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.ప్రేమ వివాహాలకు సంబంధించి స్వంత నిర్ణయాలు తీసుకోవడంవలన ఇబ్బంది పడతారు.
పరిహారాలు : ఈ రాశివారు ప్రతి రోజు ప్రతి నిత్యం ఓం నమశ్శివాయ వత్తులతో, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, దుర్గ స్తోత్రం పఠించడం లేదా వినడం, అలాగే 21 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం చెప్పదగినది.
Disclaimer: పైన అందించిన సమాచారం గోచార ఫలితాల ఆధారంగా చెప్పబడుతుంది. వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్య పండితుల దగ్గర సూచనలు, సలహాలు తీసుకోవాలి. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించదు. మీకున్న వ్యక్తిగత సమస్యల కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
