దివంగత నటి శ్రీదేవికి చెందిన స్థిరాస్తి వివాదం ఇప్పుడు మద్రాస్ హైకోర్టు మెట్లెక్కింది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ సమీపంలోని 4.7 ఎకరాల భూమికి సంబంధించి కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నిర్మాత బోనీ కపూర్, ఆయన కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం (మార్చి 16) ఈ పిటిషన్ విచారణకు రాగా.. కోర్టు స్టేను పొడిగిస్తూ తుది విచారణను మార్చి 26, 2026కు వాయిదా వేసింది.
శ్రీదేవి ఆమె సోదరి 1988లో కొనుగోలు చేసిన ఈ ఆస్తిపై ఎం.సి. శివకామి, ఆమె సోదరి ఎం.సి. నటరాజన్, వారి తల్లి చంద్రభాను హక్కులు కోరుతూ చెంగల్పట్టు కోర్టులో దావా వేశారు. తమ తాతగారికి చెందిన ఈ భూమిని అక్రమ పత్రాలతో కొనుగోలు చేశారని, ఆ నాలుగు సేల్ డీడ్లను రద్దు చేయాలని వారు కోర్టును కోరారు. అయితే ఈ ఆరోపణలను బోనీ కపూర్ కుటుంబం తీవ్రంగా ఖండిస్తోంది.
ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ బోనీ కపూర్ కింది కోర్టులో అప్లికేషన్ వేశారు. ఫిర్యాదుదారుల తల్లి చంద్రభాను వివాహం చట్టబద్ధం కాదని, అది మొదటి భార్య ఉండగానే జరిగిన రెండో వివాహం అని ఆయన పేర్కొన్నారు. ఈ నిజాన్ని దాచిపెట్టి కోర్టును తప్పుదోవ పట్టించారని వాదించారు. అలాగే 37 ఏళ్ల క్రితం 1988లో జరిగిన రిజిస్ట్రేషన్లను ఇప్పుడు సవాలు చేయడం చట్టపరంగా చెల్లదని, ఈ కేసు కాలపరిమితి దాటిపోయిందని బోనీ కపూర్ తరపు న్యాయవాదులు వాదించారు.
►ALSO READ | Rajinikanth Vs TVK : "కాలమే సమాధానం చెబుతుంది".. ఆధవ్ అర్జున వ్యాఖ్యలపై రజనీకాంత్ సీరియస్!
బోనీ కపూర్ చేసిన వ్యక్తిగత విమర్శలను ఫిర్యాదుదారులు తిప్పికొట్టారు. ఆస్తికి సంబంధించిన సరైన పత్రాలు లేకే కపూర్ కుటుంబం తమ పితృత్వంపై దాడి చేస్తోందని వారు ఆరోపించారు. ఉమ్మడి ఆస్తి విభజన విషయంలో కాలపరిమితి వర్తించదని, విచారణ ద్వారానే నిజానిజాలు బయటపడతాయని వారు వాదిస్తున్నారు.
చెంగల్పట్టులోని ట్రయల్ కోర్టు.. ఫిర్యాదుదారులకు కేసు వేసే హక్కు ఉందని, ఇది విచారించదగ్గదేనని పేర్కొంటూ బోనీ కపూర్ పిటిషన్‌ను గతంలో తిరస్కరించింది. దీనిపైనే బోనీ కపూర్ కుటుంబం మద్రాస్ హైకోర్టుకు వెళ్లింది. హైకోర్టు ఈ కేసును లోతుగా పరిశీలించేందుకు మార్చి 26ను తుది గడువుగా నిర్ణయించింది. అప్పటి వరకు కింది కోర్టులో విచారణ సాగకుండా స్టే విధించింది. మెుత్తానికి శ్రీదేవి మరణం తర్వాత కూడా ఆమె ఆస్తుల చుట్టూ ముసురుకున్న ఈ చట్టపరమైన చిక్కులు ఇప్పుడు సినీ, న్యాయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.
