కన్యారాశి: పేరు.. ప్రఖ్యాతులు పెరుగుతాయి.. కొత్త వ్యక్తుల పరిచయం.. అనుకోని ఫలితాలు సాధిస్తారు

కన్యారాశి: పేరు.. ప్రఖ్యాతులు పెరుగుతాయి.. కొత్త వ్యక్తుల పరిచయం.. అనుకోని ఫలితాలు సాధిస్తారు

కన్యరాశి 

ఆదాయం : 08
వ్యయం : 11
రాజపూజ్యం: 05
అవమానం: 05

ఉత్తర 2,3,4 పాదములు,
హస్త 1,2,3,4 పాదములు,
చిత్త 1,2 పాదముల యందు పుట్టినవారు
"టో, పా,పి. పూ, షం, ణా, కా, పే. పో" 
అను అక్షరములు తమ పేరునకుమొదట గలవారు కన్యారాశికి చెందినవారు.

2026 - 2027 సంవత్సర ఫలితాలు : కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. గడిచిన సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం బాగుంటుందని చెప్పవచ్చు. అతిపెద్ద గ్రహమైన శని ఈ సంవత్సరం ఏడవ స్థానంలో అంటే మీన రాశిలో ఉంటాడు.

రాహువు కుంభ రాశిలో, కేతువు 12వ స్థానంలో అంటే వ్యయ స్థానంలో ఉంటాడు. గురువు జూన్ రెండవ తేదీ వరకు పదవ స్థానంలో అంటే కర్మ స్థానంలో ఉంటాడు. జూన్ 2 నుండి లాభ స్థానంలోకి అనగా 11వ స్థానంలోకి గురువు వెళ్తాడు. అక్టోబర్ 31వ తేదీ నుండి వ్యయ స్థానంలోకి వెళ్తాడు.

ముఖ్య గ్రహాల స్థానాన్ని చూసుకున్నట్లయితే వృత్తి పరంగా ఆర్థిక పరంగా గురువు కర్మ స్థానంలో ఉండటం వలన సంవత్సర ప్రథమార్ధంలో ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి జూన్ రెండవ తేదీ వరకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు.

గురువు యోగిస్తున్నాడు కాబట్టి ప్రభుత్వ పరమైన ఉద్యోగం కానీ, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాలకు గానీ ఎంపిక కావడం జరుగుతుంది. వృత్తిపరంగా మాత్రం అభివృద్ధి చాలా బాగుంటుంది. పనిలో ఒత్తిడి కూడా అదేవిధంగా ఉంటుంది. జూన్ రెండవ తేదీ నుండి ఈ కన్యా రాశి వారికి ఆర్థికంగా అద్భుతమైన లాభాలను అందుకోగలుగుతారు.

మీరు పెట్టుబడి పెట్టిన సంస్థల నుండి రాబడి, ఆకస్మిక ధన లాభం వంటివి కలుగుతాయి. రాహువు ఈ రాశి వారికి ఆరవ ఇంటిలో ఉన్నాడు. ఇది చాలామంచి యోగం. మీ శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు. శని సప్తమ స్థానంలో అంటే వివాహ స్థానంలో ఉన్నంత కాలం వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఏర్పడుతాయి.

పరాభవ నామ సంవత్సర ప్రథమార్ధం వరకు కూడా మంచి ఫలితాల కోసం చాలా కష్టపడవలసి ఉంటుంది. గురువు పదవ ఇంట్లో అలాగే 11వ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి.

విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి రాహువు. ఆరవ ఇంట్లో ఉండటం అనేది గొప్ప విజయాన్ని సూచిస్తుంది. సాఫ్ట్​ వేర్​ రంగంలో ఉన్నవారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి, ట్రావెల్ ఏజెన్సీ రంగాల వారికి బాగుంటుంది.

ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యునిటిపవర్ తక్కువగా ఉంటుంది. ఉన్నత విద్యా విషయాలకు సంబంధించి ఎవరైతే విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారో ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు. విదేశాల్లో స్థిరపడడానికి మీరు చేసే ప్రయత్నాలు కావచ్చు విదేశీ విద్యకు సంబంధించిన విషయాలలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

ALSO READ : సింహరాశి : సమస్యలు అధగమిస్తారు.. బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగే అవకాశం

గురువు ఈ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలిస్తున్నాడు. గురువు జూన్ 2 నుండి ఏకాదశ స్థానంలో సంచరించడం వలన కార్య విఘ్నత అనేది ఉండదు. రాహువు ఆరవ ఇంట్లో ఉండటం అనేది అదృష్ట స్థానంగా చెప్పవచ్చు. విద్యార్థినీ విద్యార్థులు మీ కృషిపట్టుదలతో మంచి ర్యాంకులు సాధించడానికి గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయని చెప్పవచ్చు.

ఈ రాశి వారికి కేతువు 12వ స్థానంలో ఉండటం వలన శాస్త్ర పరిజ్ఞానం పెరుగుతుంది. పుణ్య కార్యాలు చేస్తారు. సమాజంలో పేరుప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. దైవ కార్యక్రమాలు చేస్తారు. డిసెంబర్ 5న కేతువు వ్యయం నుండి లాభస్థానంలోకి మారడం వలన వృత్తిలో మంచి పేరుప్రఖ్యాతులు, సామాజికంగా అందరిలోను మంచి గుర్తింపుతెచ్చుకుంటారు. ప్రతివిషయంలో శ్రద్ధ కలిగి ఉంటారు. యోగ, ధ్యానం మెడిటేషన్ మరియు దైవ కార్యక్రమాలలో పాల్గొనడం వలన వీరికి మనశ్శాంతి లభిస్తుంది.

స్త్రీలకు ప్రత్యేకం : ఈ రాశి స్త్రీలకు శారీరకశ్రమ ఎక్కువగా ఉంటుంది. తరచుగా కుటుంబ, ఉద్యోగ విషయాలలో ఇతరుల నుంచి సహాయ సహకారాలు తగ్గుతాయి. పనులు సమయపాలన లేకుండా సాగడం వలన ముఖ్యమైన పనుల్లో ప్రతికూల ఫలితాలు చూస్తారు.

వైద్య సలహాలు. చక్కటి నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ఆరోగ్యంతోమంచి జీవనం సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం. మీరు చేస్తున్న ప్రయత్నాలు సానుకూలపడడం, పలుకుబడి పెరగడం వంటివి జరుగుతాయి. కష్ట సమయంలో మిత్రులకు అండగా నిలబడతారు.

విద్యా సాంస్కృతిక సంబంధమైన విషయాలు బాగుంటాయి. గైనిక్ సమస్యలు తలెత్తుతాయి. ప్రతిపనిలో ఆటంకాలు ఎదురైనా మనోబలంతో, ఆత్మవిశ్వాసంతో విజయం సాధించగలుగుతారు. వివాహాది శుభకార్యాలు ప్రారంభంలో విసుగు కలిగించిన మధ్యవర్తుల ప్రమేయంతో నిశ్చయం అవుతాయి.

వివాహ సంబంధమైన విషయాలలో మొండి పట్టుదలతో కాకుండా కొన్ని విషయాలలోనైన సర్దుకుపోయే ధోరణిని అవలంభిస్తారు. మీ మనోధైర్యం, నిబ్బరం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్యూటీపార్లర్స్ నడిపేవారికి కాలం అనుకూలంగా ఉంది. చాలా విషయాలలో మీ ఆధిపత్యం. కొనసాగుతుంది. ఆదాయం బాగున్నప్పటికీ ఖర్చులు. అధికంగా ఉండటం చికాకు కలిగిస్తుంది. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావనవుంటుంది.

శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. కొంత వరకు రుణాలు తీర్చగలుగుతారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసేవారు, చేతి వృత్తి పనులు చేసేవారికి, హోమియోపతి వైద్యులకు, ఆర్టిఫిషియల్ జ్యూవెలరీ రంగంలో ఉన్నవారికి, చేనేత కార్మికులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వివాదాలు నిదానంగా సర్దుకుంటాయి. మీది అనుకున్నది. ఆశించినది, ఆశపడి, కృషి చేసినది నిజంగా మీదే అవుతుంది.

పరిహారాలు:ఈ రాశివారు 21 మంగళవారాల పాటు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం కన్నాద్వితీయార్థం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు

Disclaimer: పైన అందించిన సమాచారం గోచార ఫలితాల ఆధారంగా చెప్పబడుతుంది. వ్యక్తిగత జాతకాన్ని జ్యోతిష్య పండితుల దగ్గర సూచనలు, సలహాలు తీసుకోవాలి.  ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించదు. మీకున్న వ్యక్తిగత సమస్యల కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించటం ఉత్తమం.