హైదరాబాద్: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి ఆఫ్ ది రికార్డ్గా స్పందించారు. ఈ కేసులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్కు రూల్ ప్రకారమే స్టేషన్ బెయిల్ ఇచ్చారని, ఇందులో తమ ప్రమేయం లేదని సీఎం స్పష్టం చేశారు. ఈ కేసులో నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు.. మొత్తం దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశామని సీఎం చెప్పారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్కు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
మార్చి 16 (సోమవారం) నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో రూల్స్ ప్రకారం అతనికి బెయిల్ మంజూరు చేశారు. ఎంపీ మహేష్తో పాటు ఈ కేసులో అరెస్ట్ అయిన ప్రియాంక రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పుల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది.
ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు పర్యవేక్షణలో చేవెళ్ల డీసీపీ యోగేశ్‌గౌతమ్ చీఫ్‌గా మొత్తం 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. ఫామ్‌హౌస్ కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్ పార్టీలు, అంతర్రాష్ట్ర గ్యాంగ్‌స్టర్ సెటిల్‌మెంట్లపై సమగ్ర దర్యాప్తు చేసి.. 3 నెలల్లోగా చార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు.
రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీలో రోహిత్ రెడ్డి, ఏపీలోని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్, రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన రియల్టర్ నమిత్ శర్మ సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పుట్టా మహేష్ యాదవ్కు స్టేషల్ బెయిల్ ఇచ్చారు. రోహిత్ రెడ్డి, నమిత్ శర్మ, రితేష్ రెడ్డి ప్రస్తుతం చంచల్‌గూడ జైలు రిమాండ్‌లో ఉన్నారు.
