హరిత హోటళ్లలో మందు కిక్కు! పర్యాటకుల డిమాండ్ మేరకేనా ?

హరిత హోటళ్లలో మందు కిక్కు! పర్యాటకుల డిమాండ్ మేరకేనా ?
  • ఆదాయం పెంచుకునేందుకు పర్యాటక శాఖ కసరత్తు
  • కొత్తగా మరో 6 చోట్ల బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు
  • పోచంపల్లి, గద్వాల, అలీసాగర్, కవ్వాల్‌‌‌‌, వేములవాడ, భద్రాచలం ఏర్పాటుకు కార్యాచరణ
  • ఇప్పటికే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆరు చోట్ల విజయవంతంగా నిర్వహణ
  • ప్రభుత్వ ఆమోదం తర్వాత అందుబాటులోకి కొత్త బార్లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని హరిత హోటళ్లలో బార్​అండ్​ రెస్టారెంట్లను ఏర్పాటు చేసేందుకు పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీ టీడీసీ) కసరత్తు చేస్తోంది. ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా కొత్తగా ఆరు హరిత హోటళ్లలో వీటని ఏర్పాటు చేసేందుకు పర్యాటక శాఖ ప్రతిపాదనలు రెడీ చేసింది. టూరిస్టులు అధికంగా వచ్చే ప్రాంతాల్లో ఈ సదుపాయం కల్పించడం ద్వారా అదనంగా ఆదాయం సమకూరుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. 

అయితే, రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28 హరిత హోటళ్లు ఉండగా.. వీటిలో చాలావరకు పర్యాటక ప్రాంతాలకు చేరువలో ఉన్నాయి. ప్రైవేటు హోటళ్లతో పోలిస్తే హరిత హోటళ్లలో మంచి వసతులున్నా.. బార్ అండ్ రెస్టారెంట్ల సదుపాయం లేకపోవడంతో పర్యాటకులు ఇతర చోట్లకు వెళ్తున్నారని ఆఫీసర్లు గుర్తించారు.

కొత్తగా ఆరు చోట్ల బార్ అండ్ రెస్టారెంట్లు..
రాష్ట్రంలో ఇప్పటికే ఆరు హరిత హోటళ్లలో బార్ అండ్ రెస్టారెంట్లను పర్యాటక శాఖ ప్రయోగాత్మకంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌‌‌‌లోని తారామతి బరాదరి, బేగంపేటలోని హరిత ప్లాజా, నాగార్జునసాగర్, వికారాబాద్, వరంగల్,​ నిజామాబాద్ హరిత హోటళ్లలో ప్రస్తుతం బార్ అండ్ రెస్టారెంట్లు నడుస్తున్నాయి. ఇక్కడ విజయవంతంగా నడుస్తుండటంతో పాటు పర్యాటకుల నుంచి మంచి స్పందన వస్తుండటం.. తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. ఇప్పుడు ఇతర పర్యాటక ప్రాంతాలకు కూడా దీనిని విస్తరించాలని నిర్ణయించారు. వీటి ద్వారా పర్యాటక ఆదాయం భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. 

కాగా, ప్రైవేట్ ఆధీనంలో నడుస్తున్న హరిత హోటల్స్‌‌‌‌లో చాలా చోట్ల బార్లు విజయవంతంగా నడుస్తున్నాయి. దీంతో ప్రధానంగా చేనేత క్లస్టర్‌‌‌‌గా పేరున్న పోచంపల్లి, కోట, దేవాలయాల సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం గద్వాలలో, లేక్ వ్యూ పర్యాటకులను ఆకట్టుకునేలా నిజామాబాద్​జిల్లా అలీ సాగర్, వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వచ్చే పర్యాటకుల కోసం మంచిర్యాల జిల్లా కవ్వాల్‌‌‌‌లో బార్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. 

వేములవాడ, భద్రాచలం రెండు చోట్ల ఏర్పాటు చేయాలని భావించినా.. సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. కాబట్టి అందరికీ బార్​అండ్​రెస్టారెంట్‌‌‌‌పై ఆసక్తి ఉండకపోవచ్చు. భక్తుల విశ్వాసాలు, మనోభావాలకు ఏమైనా భంగం కలుగుతుందా? వారి నుంచి వ్యతిరేకత వస్తుందా? అనే కోణంలో ఆలోచనలు చేస్తున్నారు. 

ఎక్కడెక్కడ బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలనేది ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. ఈ ప్రపొజల్స్‌‌‌‌పై త్వరలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందని సమాచారం. కాగా, ఎక్కువగా పర్యాటకులు వచ్చే హరిత హోటల్స్‌‌‌‌లో బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది సక్సెస్ అయితే మిగిలిన హోటల్స్‌‌‌‌లో ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. 

పర్యాటకుల డిమాండ్ మేరకేనా ?
రాష్ట్రంలో చాలా పర్యాటక ప్రాంతాల్లో రాత్రిపూట బస చేసే పర్యాటకులు లిక్కర్ సదుపాయం కోరుతున్నట్లు క్షేత్రస్థాయి నివేదికలు చెబుతున్నాయి. హరిత హోటళ్లలో బార్ అండ్​ రెస్టారెంట్​ఉంటే పర్యాటకులు సురక్షితంగా అక్కడే గడిపే అవకాశం ఉంటుందని, తద్వారా హోటల్ ఆక్యుపెన్సీ కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

అంతేకాదు, మద్యం విక్రయాలకే పరిమితం కాకుండా, హరిత హోటళ్లలో వసతులు, ఆహారం నాణ్యతను కూడా మెరుగుపరచాలని పర్యాటక శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎక్సైజ్ నిబంధనలకు లోబడి ఆయా హోటళ్లలో ప్రత్యేకంగా బార్లను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నది. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చాక ఆరు చోట్ల కొత్తగా బార్లు ఏర్పాటుకు రంగం సిద్ధం చేయనున్నారు.