ఢిల్లీలో వంద స్కూళ్లకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలో వంద స్కూళ్లకు బాంబు బెదిరింపులు
  • రష్యా నుంచి మెయిల్  పంపిన దుండగుడు
  • డాగ్, బాంబ్ స్క్వాడ్​తో స్కూల్స్​లో తనిఖీలు
  • నకిలీ బాంబు బెదిరింపు అని తేల్చిన పోలీసులు
  • పాకిస్తాన్ ఐఎస్ఐ, ఐఎస్ పనే అని అనుమానం

న్యూఢిల్లీ/నోయిడా : దేశ రాజధాని ఢిల్లీ ఎన్​సీఆర్ ఏరియాలోని సుమారు వంద స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. బుధవారం పొద్దున ఆరు గంటల నుంచే స్కూల్స్​కు మెయిల్స్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. అన్ని పాఠశాలలకు దుండగుడు ఒకే మెయిల్ పంపించినట్టు ఢిల్లీ ఫైర్ సర్వీస్(డీఎఫ్ఎస్) అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్ స్క్వాడ్​ను రంగంలోకి దించారు. ముందుగా స్టూడెంట్స్​ను బయటికి తీసుకొచ్చారు. అన్ని స్కూళ్లను సెర్చ్ చేయగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదని వివరించారు.

ఢిల్లీలో అలజడి సృష్టించేందుకే దుండగుడు రష్యా నుంచి ఆయా స్కూళ్లకు మెయిల్ పంపినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తున్నది. కాగా, బాంబు బెదిరింపు విషయం తెలుసుకున్న స్టూడెంట్స్ తల్లిదండ్రులంతా వెంటనే స్కూల్స్​కు చేరుకున్నారు. తమ పిల్లలను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

రష్యా నుంచి మెయిల్స్

ఢిల్లీలోని ద్వారక, చాణక్యపురి, వసంత్‌‌ కుంజ్‌‌, సాకేత్‌‌ పాటు మొత్తం వంద స్కూళ్లకు ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఐపీ అడ్రస్ ఆధారంగా  దుండగుడు రష్యా నుంచి మెయిల్స్ పంపినట్టు గుర్తించామన్నారు.

స్పందించిన కేంద్ర హోంశాఖ, లెఫ్టినెంట్ గవర్నర్

బాంబు బెదిరింపు మెయిల్స్​పై కేంద్ర హోంశాఖ స్పందించింది. నకిలీ బాంబు బెదిరింపు మెయిల్‌‌గా పోలీసులు గుర్తించారని తెలిపింది. మెయిల్స్ ఎవరు పంపించారన్నదానిపై ఢిల్లీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తెలిపారు. 

బెదిరింపు మెయిల్స్ వెనుక ఐసిస్ హస్తం!

బెదిరింపు మెయిల్ వెనుక టెర్రరిస్టుల హస్తం ఏమైనా ఉందా? అనే కోణంలో ఢిల్లీ స్పెషల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రస్ అనేది రష్యన్ డొమైన్​కు చెందినదిగా పోలీసులు గుర్తించారు. రష్యాతో పాటు పాకిస్తాన్​కు ఉన్న సంబంధాల గురించి ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఐఎస్ఐ సూచన మేరకు ఐఎస్ మాడ్యూల్ ద్వారా బెదిరింపులు పంపినట్లు అనుమానం ఉందని ఒక అధికారి తెలిపారు.

స్కూల్స్ ముందు టెన్షన్.. టెన్షన్..

ఢిల్లీ ఎన్​సీఆర్ పరిధిలోని వంద స్కూల్స్ వద్ద బుధవారం ఉదయం టెన్షన్ వాతావరణం కనిపించింది. తల్లిదండ్రులంతా స్కూల్స్​కు రావడం, స్టూడెంట్స్ క్లాస్ రూమ్​ల నుంచి బయటికి పరుగెత్తడం, విద్యార్థుల ఏడ్పులు, ఫైరింజిన్ల సైరెన్లు, స్నిఫర్ డాగ్స్, బాంబ్ స్క్వాడ్ తనిఖీలతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. తన కూతురును స్కూల్​లో డ్రాప్ చేసి ఇంటికొచ్చేసరికి బాంబు బెదిరింపు వార్త చూశానని, వెంటనే వెళ్లి తన బిడ్డను ఇంటికి తెచ్చుకున్నట్టు ఓ తండ్రి వివరించారు.

ఎక్స్​ట్రా క్లాసుల కోసం తన కొడుకు పొద్దున ఆరున్నరకే స్కూల్​కు వెళ్లాడని, 8 గంటలకు బాంబు బెదిరింపు మెయిల్ విషయం తెలుసుకుని వెంటనే స్కూల్​కెళ్లినట్టు ఓ తల్లి చెప్పింది. కాగా, బాంబు బెదిరింపు వచ్చినట్టు తెలుసుకున్న కొందరు స్టూడెంట్లు ప్రాణాలు కాపాడుకునేందు కు చెట్లెక్కినట్టు స్కూల్ సిబ్బంది తెలిపారు.