ఇక చాలు.. అబద్ధాలు చెప్పడం ఆపండి: ప్రధాని మోడీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్

ఇక చాలు.. అబద్ధాలు చెప్పడం ఆపండి: ప్రధాని మోడీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్

న్యూఢిల్లీ: దేశ విభజన సమయంలో అస్సాంను పాకిస్తాన్‌కు అప్పగించడానికి కాంగ్రెస్ కుట్ర చేసిందని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రధాని మోడీ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్.. ఆయన వ్యాఖ్యలను చారిత్రాత్మకం అబద్ధం, రాజకీయంగా ప్రేరేపించబడిందని అభివర్ణించింది. మోడీ చరిత్రను వక్రీకరిస్తూ అబద్ధాలు చెప్పడం ఆపాలని చురకలంటించింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మోడీ వ్యాఖ్యలపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. 

అస్సాంను పాక్‎లో కలపాలని కాంగ్రెస్ చూసిందని మోడీ చేసిన కామెంట్స్‎ను తీవ్రంగా తిరస్కరించిన ఆయన.. ప్రధాని వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం, రాజకీయ ప్రేరేపితమని అన్నారు. హిందూ మెజారిటీ ప్రావిన్స్ అయిన అస్సాంను పాకిస్తాన్‌కు అప్పగించే ప్రతిపాదన లేదని క్లారిటీ ఇచ్చారు. అస్సాంలో ముస్లిం మెజారిటీ ప్రాంతమైన సిల్హెట్ జిల్లాలో ప్రజాభిప్రాయం నిర్వహించగా.. తూర్పు బెంగాల్‌లో, తరువాత తూర్పు పాకిస్తాన్‌లో చేరాలని అక్కడి ప్రజలు ఓటు వేశారని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాదని స్పష్టం చేశారు.

 అస్సాం తొలి సీఎం గోపీనాథ్ బోర్డోలోయ్ కృషి కారణంగా కరీంగంజ్ ఉపవిభాగం ఇండియాలోనే ఉండిపోయిందని తెలిపారు. ఇది అసలు నిజమని.. ప్రధాని మోడీ ఆరోపించినట్లు అస్సాంను పాకిస్తాన్‌కు ఇవ్వడానికి కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఎటువంటి చారిత్రక ఆధారాలు లేవని క్లారిటీ ఇచ్చారు. బ్రిటిష్ వారి తొందరపాటు,  ముస్లిం లీగ్ డిమాండ్ కారణంగా దేశ విభజన జరిగిందని గుర్తు చేశారు. కానీ మోడీ సంక్లిష్టమైన, విషాదకరమైన చరిత్రను ప్రచార నినాదంగా మార్చారని దుయ్యబట్టారు. మోడీ శిక్షణ పొందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని.. అబద్ధాలు చెబుతూ జీవించేవాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.