సినిమా పైరసీ చేస్తే మూడేండ్ల జైలు, 3 లక్షల ఫైన్

సినిమా పైరసీ చేస్తే మూడేండ్ల జైలు, 3 లక్షల ఫైన్

రాష్ట్రంలో సినిమా పైరసీని కట్టడి చేసేందుకు టీజీ సైబర్‌‌ సెక్యూరిటీ బ్యూరో పటిష్ట చర్యలు చేపట్టింది. సినిమా పైరసీ చేస్తే మూడేండ్ల  జైలు శిక్ష, రూ.3 లక్షల వరకు జరిమానా లేదా సినిమా నిర్మాణ వ్యయంలో 5 శాతం జరిమానా తప్పదని హెచ్చరించింది.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో సినిమా పైరసీని కట్టడి చేసేందుకు టీజీ సైబర్‌‌‌‌‌‌‌‌ సెక్యూరిటీ బ్యూరో పటిష్ట చర్యలు చేపట్టింది. సినిమా థియేటర్లలో ప్రదర్శించేందుకు, పైరసీ కేసుల విచారణ కోసం సరికొత్త  స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌‌‌‌‌‌‌‌ఓపీ)ని ఆదివారం విడుదల చేసింది. సినిమా పైరసీ చేస్తే మూడేండ్ల  జైలు శిక్ష, రూ.3 లక్షల వరకు జరిమానా లేదా సినిమా నిర్మాణ వ్యయంలో 5 శాతం జరిమానా తప్పదని హెచ్చరించింది.ఈ మేరకు సీఎస్ బీ డైరెక్టర్ శిఖాగోయల్‌‌‌‌‌‌‌‌ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

సినిమా పైరసీ అరికట్టేందుకు తెలుగు ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ చాంబర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ కామర్స్‌‌‌‌‌‌‌‌ (టీఎఫ్‌‌‌‌‌‌‌‌సీసీ)తో కలిసి సంయుక్తంగా ఈ ఏడాది జనవరి 5న యాంటీ -పైరసీ యూనిట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ యూనిట్ ఆధ్వర్యంలో థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు ప్రదర్శించే యాంటీ- పైరసీ  డిస్‌‌‌‌‌‌‌‌క్లైమర్లను రూపొందించారు. దీని  ద్వారా సినిమా హాళ్లలో కెమెరాతో చిత్రీకరణ (క్యామ్‌‌‌‌‌‌‌‌కార్డింగ్) చేయడం, పైరసీ చేయడం చట్టవిరుద్ధమని ప్రేక్షకులకు అవగాహన కల్పించనున్నారు. 

కొత్త ఎస్‌‌‌‌‌‌‌‌ఓపీ ద్వారా దర్యాప్తు వేగవంతంగా, పద్ధతిగా సాగుతుందని పేర్కొన్నారు.  టీఎఫ్‌‌‌‌‌‌‌‌సీసీ అధ్యక్షుడు దగ్గుబాటి సురేశ్‌‌‌‌‌‌‌‌బాబు మాట్లాడుతూ..  సినిమా పైరసీ వల్ల పరిశ్రమకు తీవ్ర ఆర్థిక నష్టం కలుగుతోందని, నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్లు అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.