లౌకిక వాదమే కాంగ్రెస్ విధానం : మల్లు రవి

లౌకిక వాదమే కాంగ్రెస్ విధానం : మల్లు రవి
  • పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి 

న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యాంగంలోని లౌకికవాదమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన విధానమని, అన్ని మతాలను గౌరవించడమే తమ పార్టీ సిద్ధాంతమని పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్, ఎంపీల ఫోరం కన్వీనర్ మల్లు రవి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం సెక్యులరిజం అని, తమ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తున్నదని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఏ మతాన్ని ఉద్దేశపూర్వకంగా విమర్శించలేదని, కేవలం కొందరు కావాలనే దీనిపై రాద్దాంతం చేస్తూ మత రాజకీయాలకు తెరలేపుతున్నారని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ మత సామరస్యాన్ని కాపాడుతుందని చెప్పారు. 

రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. విదేశాల నుంచి అక్రమ మార్గాల్లో జరుగుతున్న సరఫరాను అడ్డుకునేందుకు అన్ని మార్గాలను గుర్తిస్తున్నామని వెల్లడించారు. యువత ఎవరూ మాదకద్రవ్యాల ఉచ్చులో చిక్కుకోవద్దని ఆయన కోరారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మల్లు రవి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.