- డబ్బాలపై ‘క్వాలిటీ విత్ నో కాంప్రమైజ్’ క్యాప్షన్
- ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు
శంషాబాద్, వెలుగు : రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలో కెమికల్స్ కలిపిన ఆహార పదార్థాలు, ఎక్స్‌పైరీ అయిన స్వీట్స్ అమ్ముతున్న రెండు కంపెనీలపై దాడి చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్చేశారు. సుభాన్ కాలనీలో లక్కీ ఫుడ్స్ కంపెనీ ఉంది. అలాగే, లక్ష్మిగూడలో మెస్సర్స్ జీ ఫుడ్స్ కంపెనీ ఉంది. ఈ రెండు చోట్లా తొందరగా పాడుకాకుండా కెమికల్స్కలిపిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారు.
అంతేగాకుండా అపరిశుభ్ర వాతావరణంలో తయారు చేస్తున్నారు. లడ్డూ, బాదూషా, జిలేబి వంటి స్వీట్లను తయారు చేసి డబ్బాల్లో ప్యాక్చేసి ఎక్స్‌పైరీ అయినా వాటినే నగరంలోని అన్ని షాపులకు అమ్ముతున్నారు. కొన్ని ఆహార పదార్థాలైతే 2020లో ఎక్స్‌పైరీ అయినవి కూడా ఉన్నాయి. ఆ డబ్బాలపై ‘క్వాలిటీ విత్నో కాంప్రమైజ్’ అని క్యాప్షన్కూడా ముద్రించారు.
ఈ రెండు కేసుల్లో అబ్దుల్ హక్, మహమ్మద్ ఖమరుద్దీన్ ను అరెస్ట్ చేశారు. ఎక్స్‌పైరీ వెనిల్లా ఫ్లేవర్, సోడియం బెంజోయేట్ స్వాధీనం చేసుకున్నారు. 98 బాక్సుల మోతీచూర్ లడ్డూ, 35 కిలోల లడ్డూ మిశ్రమం సీజ్ చేశారు. స్వాధీనం చేసిన వస్తువుల విలువ రూ.1.10 లక్షలు ఉంటుందని అంచనా. మైలార్దేవ్పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
