కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి : ఎంపీ కడియం కావ్య

కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి : ఎంపీ కడియం కావ్య
  • లోక్‌‌‌‌సభలో ఎంపీ కడియం కావ్య డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కీలక రైల్వే జంక్షన్ అయిన కాజీపేటను కేంద్రంగా చేసుకుని కొత్త రైల్వే జోన్ లేదా శక్తిమంతమైన సబ్-జోన్‌‌‌‌ను ఏర్పాటు చేయాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దశాబ్దాల కాలంగా పెండింగ్‌‌‌‌లో ఉన్న కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌‌‌‌ను తక్షణమే ప్రారంభించాలన్నారు. ఇందులో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. 

ఈ మేరకు సోమవారం లోక్‌‌‌‌సభలో 2026–-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ ‘డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్’పై జరిగిన చర్చలో ఆమె పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ఐటీ, ఔషధ, పారిశ్రామిక రంగాలు వేగంగా ఎదుగుతున్నప్పటికీ , ఆ స్థాయికి తగ్గట్టుగా రైల్వే మౌలిక వసతులు అభివృద్ధి చెందలేదని ఆమె విమర్శించారు. ముఖ్యంగా కాజీపేట జంక్షన్‌‌‌‌పై పెరుగుతున్న రద్దీని తగ్గించడం అత్యవసరమని పేర్కొన్నారు. 

కాజీపేటలో ప్రతిపాదించిన ‘రైల్ అండర్ రైల్ టన్నెల్’ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. హైదరాబాద్‌‌‌‌ను చెన్నై, బెంగళూరు, ఫుణె సిటీలతో అనుసంధానించే హైస్పీడ్ రైల్వే కారిడార్ల ప్రకటనను స్వాగతించారు. అయితే, వాటి అమలుకు స్పష్టమైన టైమ్‌‌‌‌లైన్ ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాలకు రైల్వే సౌకర్యం కల్పించేలా ట్రాక్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం సానుకూల దృక్పథంతో వ్యవహరించి, తగిన నిధులు కేటాయించాలని సభ ద్వారా కేంద్ర రైల్వే మంత్రికి ఆమె విజ్ఞప్తి చేశారు.