హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలోని పలు కార్యాలయాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. హైడ్రా కార్యాలయంలో జరిగిన ప్రజావాణికి 48 ఫిర్యాదులు అందగా, కమిషనర్ ఏవీ రంగనాథ్ వాటిని స్వీకరించారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ చెరువులో లేఅవుట్ మునిగిపోయిందని, చెరువులోని నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సెక్రటేరియట్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
చెరువు ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించి తమ లేఅవుట్లు మునుగకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు. పటాన్ చెరు మండలం పాటి గ్రామంలో 92 ఎకరాల విస్తీర్ణంలో 1,100 ప్లాట్లతో ఏర్పాటు చేసిన ఆనందనగర్ కాలనీలో 32 ఎకరాలను స్థానిక ప్రజాప్రతినిధుల అండతో కొందరు ఆక్రమించి మరో లేఅవుట్ వేసి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ప్లాట్ యజమానులు ఫిర్యాదు చేశారు.
అలాగే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి సమీపంలోని కాకతీయనగర్ కాలనీకి ఆనుకుని ఉన్న బాచుపల్లి చెరువులో మురుగు కలవకుండా చూడాలని హరిహర హాల్‌మార్క్ కల్చరల్ అసోసియేషన్ ప్రతినిధులు కోరార.
జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో..
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 46 ఫిర్యాదులు రాగా, కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్వీకరించారు. సీఎంసీ ప్రజావాణికి 31 ఫిర్యాదులు రాగా కమిషనర్ సృజన స్వీకరించారు. ఎంఎంసీ కార్యాలయంలో 22 ఫిర్యాదులను కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి స్వీకరించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ హరిచందన, అడిషనల్ కలెక్టర్ జి.జితేందర్ రెడ్డి, రెవెన్యూ అధికారి ఈ. వెంకటాచారి అర్జీలను స్వీకరించారు. హౌసింగ్ శాఖకు 271, రెవెన్యూ శాఖకు 42, ఇతర శాఖలకు 18 అర్జీలు వచ్చినట్లు తెలిపారు.
రంగారెడ్డిలో 52 ఫిర్యాదులు..
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి కలెక్టరేట్ కు 52 ఫిర్యాదులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి వాటిని స్వీకరించి.. సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు.
