మూడేండ్లలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తం: గవర్నర్ శివ్ ప్రతాప్శుక్లా

మూడేండ్లలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తం: గవర్నర్ శివ్ ప్రతాప్శుక్లా
  • ఆత్మగౌరవం, సామాజిక న్యాయమే మా ప్రజా పాలనకు గీటురాయి
  • వాట‌‌ర్ బోర్డు, హైడ్రా ఒకే పాలనా ప‌‌రిధిలోకి 
  • రిజిస్ట్రేషన్, రెవెన్యూ ఒకే వేదికపైకి
  • హైదరాబాద్- అమరావతి గ్రీన్‌‌ఫీల్డ్ ఎక్స్‌‌ప్రెస్‌‌వే.. 3 బుల్లెట్ రైళ్లు
  • డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం ఈగల్ యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్ 
  • విజన్- 2047తో భవిష్యత్ తెలంగాణ నిర్మాణానికి పకడ్బందీగా పునాదులు
  • బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమంలో తమ ప్రభు త్వాన్ని ఎవరూ ఆపలేరని గవర్నర్ శివ్​ ప్రతాప్​ శుక్లా అన్నారు. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది, సమ్మిళిత వృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు.

ఆత్మగౌరవం, సామాజిక సమానత్వమే గీటురాయిగా పాలన సాగుతోందని ప్రకటించారు.  సోమవారం ఉదయం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్​ శివ్​ ప్రతాప్​ శుక్లా  ప్రసంగించారు. ప్రజలందరి భాగస్వామ్యంతో ప్రతి లబ్ధిదారుడి ఇంటికీ ప్రగతి ఫలాలు అందించడమే ఈ బడ్జెట్ రోడ్ మ్యాప్ ఉద్దేశమని గవర్నర్ వివరించారు.

మూసీ పునరుజ్జీవం.. ఆదిలాబాద్, వరంగల్​కు ఎయిర్​ పోర్టులు
తన ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రీకృత విధానానికి స్వస్తి పలికి ‘క్యూర్, -ప్యూర్, రేర్’ వికేంద్రీకృత నమూనాను తెచ్చిందని గవర్నర్ ఉభయ సభలకు తెలిపారు. పట్టణాభివృద్ధి కోసం ‘కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ’ (క్యూర్) అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే పాత జీహెచ్ఎంసీ చట్టాన్ని రద్దు చేసి, నగరాన్ని హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించినట్లు తెలిపారు. 

పాలనను సులభతరం చేసేందుకు హైడ్రా, వాటర్ బోర్డులను ఒకే గొడుగు కిందికి తెస్తున్నామని స్పష్టం చేశారు. కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ ఆవలికి పంపేలా ‘హిల్ట్’ పాలసీ తెచ్చామన్నారు. ఈవీలకు జీవితకాల పన్ను మినహాయింపు, ఫ్యూచర్ సిటీకి ప్రత్యేక పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేశామన్నారు. 55 కిలోమీటర్ల మేర మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టి, గోదావరి జలాలతో మూసీకి జీవం పోస్తున్నామన్నారు.

ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ మధ్య ప్రాంతాన్ని ‘పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ’ (ప్యూర్) విధానంలో లాజిస్టిక్, ఇండస్ట్రియల్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దుతున్నామని గవర్నర్ పేర్కొన్నారు. దీనికోసం 56 గ్రామాలతో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేసి ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ, అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేను నిర్మిస్తామని ప్రకటించారు. 

శంషాబాద్ కేంద్రంగా బెంగళూరు, చెన్నై, పూణేలకు మూడు హైస్పీడ్ బుల్లెట్ రైళ్లను పరుగులు పెట్టించబోతున్నామని తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో విమానాశ్రయాల పనులు వేగవంతం చేశామన్నారు. పశ్చిమ తెలంగాణ అభివృద్ధి కోసం కొడంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మల్టీ ప్రొడక్ట్ ఇండస్ట్రియల్ పార్క్, జహీరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 3,245 ఎకరాల్లో జాతీయ పారిశ్రామిక కారిడార్ పనులు శరవేగంగా సాగుతున్నాయని గవర్నర్ వెల్లడించారు.

గ్లోబల్ ​సమిట్తో రూ.5.75 లక్షల కోట్లు
తెలంగాణను గ్లోబల్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ‘రైజింగ్ గ్లోబల్ సమిట్’ ద్వారా ఏకంగా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. దావోస్ వేదికగా ఆవిష్కరించిన లైఫ్ సైన్సెస్ పాలసీ ద్వారా రూ.73 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. 

రాష్ట్ర ఐటీ ఎగుమతులు రికార్డు స్థాయిలో రూ.3.13 లక్షల కోట్లకు చేరుకున్నాయన్నారు. బయో ఏషియా సదస్సు ద్వారా అదనంగా రూ.1,700 కోట్లు వచ్చాయన్నారు. గల్ఫ్, జర్మనీ, జపాన్ లాంటి 16 దేశాల్లో మన యువతకు సురక్షితమైన ఉపాధి కల్పించేందుకు టామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కామ్ ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నామని, సఫ్రాన్ ఏరో ఇంజిన్ ఫెసిలిటీని ప్రారంభించి చరిత్ర సృష్టించామని  తెలిపారు.

సామాజిక న్యాయం దిశగా..
సామాజిక న్యాయం దిశగా దేశంలోనే తొలిసారిగా సమగ్ర సామాజిక, ఆర్థిక, కులగణనను పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గవర్నర్ స్పష్టం చేశారు. దీని ఆధారంగా చట్టసభలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చారిత్రాత్మక బిల్లును ఆమోదించామన్నారు. 

అలాగే 59 ఎస్సీ కులాలకు న్యాయం జరిగేలా మూడు గ్రూపులుగా వర్గీకరించే బిల్లును కూడా రాష్ట్రపతి ఆమోదానికి పంపామన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల గృహాలను మంజూరు చేశామన్నారు. ఏళ్లనాటి నిరీక్షణకు తెరదించుతూ కొత్తగా 15.12 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు.

ఎకో టూరిజం మోడల్లో ఆలయాల అభివృద్ధి
ఆరోగ్య తెలంగాణ లక్ష్యంతో పేదలకు కార్పొరేట్ వైద్యం అందించేలా రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీని రూ.10 లక్షలకు పెంచామని గవర్నర్ స్పష్టం చేశారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ ఆసుపత్రులు, కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఈ ఏడాదే అందుబాటులోకి తెస్తున్నామన్నారు. 

మేడారం జాతరను అత్యంత వైభవంగా నిర్వహించడంతో పాటు, రాబోయే గోదావరి పుష్కరాలకు ఆలయాలను ఎకో టూరిజం మోడల్ లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ బడ్జెట్.. ప్రతి పౌరుడి ఆశలను తీర్చే రోడ్ మ్యాప్ అని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే ప్రభుత్వ దృఢ సంకల్పమని పేర్కొన్నారు.  

అడ్డు తగిలిన బీఆర్ఎస్​ సభ్యులు
గవర్నర్ మూడు భాషల్లో ప్రసంగించారు. తెలుగులో మొదలుపెట్టి ఆ తరువాత వివిధ సందర్భాలలో ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాట్లాడారు. దాదాపు ఒక గంట 11 నిమిషాల పాటు గవర్నర్​ ప్రసంగం కొనసాగింది. పింక్​ కలర్ షర్ట్​లతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు గవర్నర్ మాట్లాడుతున్నంత సేపు నిలబడే ఉన్నారు. 

హిందీలో పాసింగ్ కామెంట్స్ చేస్తూ.. ఈ ప్రభుత్వం మీతో (గవర్నర్​)తో  అబద్ధాలు చెప్పిస్తుందని అన్నారు. ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించిన విషయాలను గవర్నర్​ ప్రసంగిస్తున్నప్పుడు అధికార సభ్యులు బల్లలపై చరచి మద్దతు ప్రకటించారు.

తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్
అంతకు ముందు 11.30 గంటలకు గవర్నర్​ శివ్​ ప్రతాప్​ శుక్లా అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయనకు మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్, సీఎం రేవంత్​ రెడ్డి ఆహ్వానం పలికారు. ఆ తరువాత అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, విప్​లు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

మహిళా సాధికారత.. విద్య ఉద్యోగ రంగాల్లో నవశకం
ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఇప్పటివరకు మహిళలు రూ.9,222 కోట్లు ఆదా చేసుకున్నారన్నారు. 42.90 లక్షల కుటుంబాలకు రూ.500 కే గ్యాస్ సిలిండర్, 53.09 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలతో పాటు, బడుల నిర్వహణ పనులు అప్పగించామన్నారు. 

శిల్పారామం వద్ద మహిళా ఉత్పత్తుల విక్రయానికి ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో సర్కారు సరికొత్త నవశకానికి నాంది పలికిందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. దేశంలోనే తొలిసారిగా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం, క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ వర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలను స్థాపించామన్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం 59 వేల మందితో ‘ఈగల్’ యాంటీ డ్రగ్ టాస్క్ ఫోర్స్​ను ఏర్పాటు చేశామన్నారు.

రైతు సంక్షేమ ప్రభుత్వంగా ముందుకు..
గ్రామీణ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను (రేర్) బలోపేతం చేసేందుకు రైతులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్నామని గవర్నర్ అన్నారు. రికార్డు వ్యవధిలో రూ.2 లక్షల రుణమాఫీ కింద 25 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్లతో రుణ విముక్తి కల్పించామని ప్రకటించారు. సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 అదనపు బోనస్ ఇచ్చామన్నారు.

రైతుల భూసమస్యల శాశ్వత పరిష్కారం కోసం 'తెలంగాణ భూభారతి చట్టం-2025'ను తీసుకొచ్చామని, రిజిస్ట్రేషన్, రెవెన్యూ, సర్వే సేవలను ఒకే వేదికపైకి తెచ్చామన్నారు. సాగునీటి రంగంలో పెండింగ్ ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేసి ఆశించిన ఆయకట్టుకు నీరందిస్తామని గవర్నర్ సభకు తెలిపారు.