పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ అప్ డేట్ : ఉదండాపూర్ లో కదలిక..చురుగ్గా రిజర్వాయర్  కట్ట నిర్మాణ పనులు

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ అప్ డేట్ : ఉదండాపూర్ లో కదలిక..చురుగ్గా రిజర్వాయర్  కట్ట నిర్మాణ పనులు

 

  • చివరి దశకు చేరుకున్న ఆర్వీఆర్  నిర్మాణం
  • గత ప్రభుత్వ హయాంలో నాసిరకం పనులతో చాలా చోట్ల భారీగా కోతకు గురైన కట్ట

మహబూబ్​నగర్/జడ్చర్ల టౌన్, వెలుగు:పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం(పీఆర్ఎల్ఐ)లో ప్రధానమైన ఉదండాపూర్​ రిజర్వాయర్  పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. వివిధ కారణాలతో ఆగుతూ సాగుతున్న పనులు.. తాజాగా నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ఇటీవల మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి పీఆర్ఎల్ఐపై ఇంజనీరింగ్​ ఆఫీసర్లు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పనుల పురోగతిపై రివ్యూ చేశారు. రానున్న రెండున్నరేండ్లలో పనులు పూర్తి చేసేలా టార్గెట్​ విధించారు. దీంతో పనులు స్పీడప్​ అయ్యాయి.

17, 18వ ప్యాకేజీల్లో పనులు ప్రారంభం..

ఉదండాపూర్​ రిజర్వాయర్​ పనులు 2016 జూన్​ 16న ప్రారంభమయ్యాయి. అయితే పనులు ప్రారంభమైనప్పటి నుంచి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. న్యాయమైన పరిహారం ఇవ్వాలనే డిమాండ్​తో తరచూ బాధిత రైతులు చేసే ఆందోళనలతో పనులు నిలిచిపోయేవి. 2023లో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వస్తోంది. 

ఇప్పటికే ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతుండగా.. తాజాగా రిజర్వాయర్​ పనుల్లోనూ వేగం పెంచింది. ఈ రిజర్వాయర్​ పనులు 17, 18వ ప్యాకేజీల్లో ఉండగా, 15.8 కిలోమీటర్ల మేర రిజర్వాయర్​ కట్ట పనులు చేపట్టాల్సి ఉంది. ఇందులో 17వ ప్యాకేజీలో ఆరు కిలోమీటర్ల మేర కట్ట నిర్మాణం చేయాల్సి ఉండగా.. ఐదు కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. కట్ట పనులు పూర్తి చేసిన ప్రాంతంలో రివిట్​మెంట్​ పనులు చేయిస్తున్నారు. మిగతా కిలోమీటరు పనులు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 200 మీటర్లకు సంబంధించిన బండ్​ ఫార్మేషన్​ పనులు చకచక జరుగుతున్నాయి. 18వ ప్యాకేజీలోనూ కట్ట పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ ప్యాకేజీలో ఇప్పటికే 65 శాతం వరకు కట్ట పనులు పూర్తయ్యాయి. రివిట్​మెంట్​ పనులు కూడా స్టార్ట్​ చేశారు.

కాగా.. రిజర్వాయర్​ ముందు భాగంలో నిర్మిస్తున్న డిస్ట్రిబ్యూషన్​ రెగ్యులేటర్(ఆర్వీఆర్) పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఆర్వీఆర్​ చుట్టూ నిర్మాణం పూర్తి కాగా.. 10 శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కర్వెన రిజర్వాయర్​ నుంచి అండర్​ టన్నెల్​ ద్వారా ఉదండాపూర్  రిజర్వాయర్​కు నీరు రానుండగా.. చివర్లో టన్నెల్​ నుంచి అర కిలోమీటర్​ వరకు ఓపెన్​ కెనాల్​ ద్వారా ఆర్వీఆర్​కు నీటిని తరలించనున్నారు. 

కీలకంగా ఉదండాపూర్..​

పాలమూరు లిఫ్ట్​ పరిధిలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉండగా.. లక్ష్మీదేవిపల్లి మినహా అన్ని రిజర్వాయర్ల పనులు కొనసాగుతున్నాయి. ఇందులో నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లు పూర్తి కాగా.. ఈ మూడింటి కింద ఆయకట్టు లేదు. ఈ ప్రాజెక్టు కింద ఉమ్మడి మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా.. ఒక్క ఉదండాపూర్​ రిజర్వాయర్​ నుంచే దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. దీంతో ఈ రిజర్వాయర్​ ప్రాజెక్టులో కీలకంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికను పనులు చేయిస్తోంది.

ఈ పనులు పూర్తైన వెంటనే కెనాల్స్​ పనులు టేకప్​ చేసే అవకాశం ఉంది. కాగా.. ఈ రిజర్వాయర్​ నుంచి 73.5 కిలోమీటర్ల మేర లెఫ్ట్​ మెయిన్​ కెనాల్, 72 కిలోమీటర్ల మేర రైట్​ మెయిన్​ కెనాల్, 63 కిలోమీటర్ల పొడవున వెస్ట్​ మెయిన్​ కెనాల్, అలాగే సౌత్, ఈస్ట్​ బ్రాంచ్​ కెనాల్స్​ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. 

గత సర్కారు నిర్వాకంతో కోతకు గురైన కట్ట..

ఈ రిజర్వాయర్​ పరిధిలో చాలా చోట్ల కట్ట కోతకు గురైంది. కట్ట పనులు పూర్తి చేసిన చోట్ల రివిట్​మెంట్​ పనులు పెండింగ్​ పెట్టడంతో.. గత రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు కట్ట పై భాగం నుంచి కింది వరకు కోతకు గురైంది. 18వ ప్యాకేజీ పరిధిలో దాదాపు ఐదు మీటర్ల లోతు నుంచి పది మీటర్ల మేర కట్ట అక్కడక్కడా కోసుకుపోయింది. గత ప్రభుత్వ హయాంలో నాసిరకం పనులు చేయడం వల్లే కట్ట కోతకు గురైందనే ఆరోపణలున్నాయి.